Nagamani Malligari April 7, 2026High Court
అమరావతికి చట్టబద్ధత..
ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి,ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత : ప్రత్తిపాటి
రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడంపై తెలుగుజాతిలో హర్షాతిరేకాలు.హైకోర్టు న్యాయవాదుల విజయోవత్సవ ర్యాలీలో మాజీమంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేయడం పట్ల యావత్ తెలుగుజాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందని,రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి కల్పించిన చట్టబద్ధత..రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన స్పష్టతకు నాంది పలికిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభించడాన్ని స్వాగతిస్తూ, హైకోర్టు న్యాయవాదుల జేఏసీ కన్వీనర్, న్యాయవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హైకోర్టు లాయర్లు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కూటమి నాయకులతో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు.
వెలగపూడిలోని హైకోర్టు సిబ్బంది క్వార్టర్స్ నుంచి హైకోర్టు ప్రాంగణం వరకు మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రత్తిపాటి, రాజధాని రైతులు,మహిళలతో కలిసి ముందుకు సాగారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఏపీ రాజధానిగా అమరావతికి లభించిన చట్టపరమైన గుర్తింపు.. రాజధానికి దక్కిన హోదాతో ఏప్రిల్ 6కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) చట్టంతో 2024 జూన్ 2 నుంచే ఏపీ కొత్త రాజధానిగా, ప్రజా రాజధాని అమరావతి నిలిచిందన్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతికి లభించిన గుర్తింపుతో ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి, స్థిరత్వాలకు స్పష్టత చేకూరిందన్నారు. పరిపాలనలో సౌలభ్యం, పెట్టుబడుల ఆకర్షణ, పెట్టుబడిదారులకు నమ్మకంతో కూడిన భరోసా లభించడంతో పాటు.. రాష్ట్ర ప్రధాన అభివృద్ధి కేంద్రంగా అమరావతి నిలవనుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.గత పాలకుల అమరావతి విధ్వంసమే లక్ష్యంగా సాగించిన కుట్రలకు వ్యతిరేకంగా నాడు న్యాయవాదులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగించిన పోరాటానికి నేడు నిజమైన ఫలితం దక్కిందని ప్రత్తిపాటి చెప్పారు.
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించడం వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల నిరంతర కృషి, పట్టుదల, ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు దాగి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.

