Pavan Chandragiri October 23, 2026
ఆంధ్రప్రభ బ్యూరో, ఖమ్మం :
అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఖమ్మం నగరానికి చెందిన ఓ తెలుగు యువతి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందింది.
ఈ విషాదకర ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్ కుమార్తె నల్లమల అక్షిత (26) ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. న్యూయార్క్ సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) పూర్తి చేసిన అక్షిత.. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
ఉన్నత చదువులు చదివి తమ కుటుంబానికి అండగా ఉంటుందని ఎన్నో ఆశలతో అక్షితను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు, ఆమె అకాల మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఖమ్మం మమతా మెడికల్ కళాశాల రోడ్డులోని నల్లమల ఆనంద్ నివాసంలో ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికా నుండి అక్షిత భౌతిక కాయాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి..
నల్లమల ఆనంద్ కుమార్తె నల్లమల అక్షిత అమెరికాలో గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నల్లమల ఆనంద్‌ను ఫోన్ ద్వారా పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే అక్షిత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుతూ అక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
