Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలి..

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

నుమకొండ, ఆంధ్రప్రభ: భారత్‌-అమెరికా మధ్య కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు వరంగల్‌ ఎంపీ కడియం కావ్యకు వినతిపత్రం అందజేశారు.

సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఎన్డీఏ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక రంగంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 385 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి వాటి రద్దుకు రైతులు పోరాడారని గుర్తుచేశారు.

2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతుల రుణమాఫీ చేపట్టడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను సబ్సిడీపై అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని కోరారు. నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనంగా రూ.31 వేలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు, నూతన విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతుల భూములను బలవంతంగా సేకరించరాదని కోరారు.

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ఎంపీకి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఏఐకేఎంఎస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్‌, జక్కుల తిరుపతి, ఓదెల రాజయ్య, సుధమల్ల భాస్కర్‌, వల్లందాస్‌ కుమార్‌, ఐత నగేష్‌, బండి కుమార్‌ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News