Nagamani Malligari September 2, 2026prabhanews.com
మెట్‌పల్లిలో ప్రైవేట్ ఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు.. సూర్య ఆస్పత్రికి షోకాజ్ నోటీసు
మెట్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ముస్కు జైపాల్‌రెడ్డి హెచ్చరించారు. మెట్‌పల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సూర్య ఆస్పత్రిలో అర్హత లేని వైద్యుడితో చెవి, ముక్కు, గొంతు నిపుణుడిగా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల విద్యార్హతలు, వైద్య మండలి నమోదు వివరాలు, ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా సూర్య ఆస్పత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా పూర్తి వివరణ సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
యాజమాన్యం సమర్పించే వివరణను పరిశీలించిన అనంతరం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డాక్టర్ జైపాల్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అనంతరం పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆస్పత్రులను కూడా అధికారులు సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆయా ఆస్పత్రుల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా నమోదిత, అర్హత కలిగిన వైద్యులతోనే ప్రజలకు వైద్య సేవలు అందించాలని డాక్టర్ జైపాల్‌రెడ్డి సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అనర్హులతో వైద్య సేవలు అందించినా, చట్టవిరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తనిఖీల సందర్భంగా జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ముస్కు జైపాల్‌రెడ్డితో పాటు మండల వైద్యాధికారి డాక్టర్ అంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
