Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అసత్య ప్రచారాలు మాని.. చెన్నూరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

Sowjanya Anneboina August 31, 2026prabhanews.com

చెన్నూర్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ అసత్య ప్రచారాలు మానుకుని చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

సోమవారం జాతీయ రహదారి 63పై జోడు వాగుల సమీపంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి, అనంతరం నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జోడు వాగుల వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు విడుదల చేయడంతో పాటు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. అటవీ అనుమతులు కూడా ఇప్పించినట్లు తెలిపారు. త్వరలోనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు మంత్రి ఆదేశాల మేరకు జోడు వాగుల వద్ద ధర్నా నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు.

కాంగ్రెస్‌ నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే చెన్నూరు పట్టణంలో ఎలాంటి అంచనాలు, టెండర్‌ ప్రక్రియ లేకుండా ప్రధాన రహదారిపై 200 ఇళ్లను కూల్చివేసి, ఇప్పటివరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని వెంకటేశ్వర్‌ గౌడ్‌ ప్రశ్నించారు. రూ.కోటి వ్యయంతో చేపడతామన్న వైకుంఠధామం పనులు కనిపించడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవినీతి జరుగుతోందని మంత్రి స్వయంగా వీడియో విడుదల చేశారని పేర్కొన్నారు.

ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జోడు వాగుల వంతెన పేరుతో కాంగ్రెస్‌ నాయకులు నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోడు వాగుల పనులను నిలిపివేసిందని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులకు కనీస అవగాహన కూడా లేదని, పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో కౌన్సిలర్‌ గర్రెపల్లి శాంత, వెంకట నరసయ్య, పెగడపల్లి సర్పంచ్‌ రాము, జైపూర్‌ మండల పార్టీ ఇన్‌చార్జి మంత్రి రామయ్య, చెన్నూరు మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌ గౌడ్‌, చెన్నూరు పట్టణ ప్రధాన కార్యదర్శులు కాగిత వెంకటేష్‌, మాణిక రైతు శంకర్‌, సీనియర్‌ బీజేపీ నాయకులు కొండపాక చారి, భీమారం మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్‌, చెన్నూరు పట్టణ నాయకులు తుమ్మ చిరంజీవి, తలారి రాజు, కొత్తూరి దుర్గాప్రసాద్‌, రమేష్‌, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News