Pavan Chandragiri September 1, 2026
- ముగ్గురు పేర్లతో కమిటీ నివేదిక..
- రేపు ట్రస్ట్ కీలక సమావేశం
అయోధ్య, ఆంధ్రప్రభ : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలిసారిగా నియమించబోయే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ కీలక పదవి కోసం వచ్చిన దరఖాస్తులు, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేసిన సెర్చ్ కమిటీ.. ముగ్గురు అభ్యర్థులతో తుది నివేదికను ట్రస్ట్‌కు సమర్పించింది. దీంతో రామమందిరం పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టబోయే తొలి సీఈవో ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.
సీఈవో పదవి కోసం 5,500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వాటిని పరిశీలించిన అనంతరం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన సెర్చ్ కమిటీ.. ముగ్గురు సభ్యులతో తుది జాబితాను రూపొందించి ట్రస్ట్‌కు అందజేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, సురేశ్ హవారేలతో కూడిన కమిటీ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది.
ఇటీవల ఆలయ విరాళాల నిర్వహణకు సంబంధించిన అంశాలు చర్చకు రావడంతో.. పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడం, వ్యవస్థలను క్రమబద్ధీకరించడం కోసం సీఈవో నియామకానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఆలయ కార్యకలాపాల సమన్వయం నుంచి పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ వరకు సీఈవో కీలక పాత్ర పోషించనున్నారు.
సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన ముగ్గురు పేర్లపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు బుధవారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ముగ్గురిలో ఒకరిని తుది అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. సమావేశం అనంతరం నూతన సీఈవో పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
