Sowjanya Anneboina April 30, 2026prabhanews.com
అయ్యప్పనగర్‌లో ముదురుతున్న వోల్టేజ్ సమస్య
- ట్రాన్స్‌ఫార్మర్ కోసం కాలనీ వాసుల డిమాండ్
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని అయ్యప్పనగర్ కాలనీలో తీవ్రమైన వోల్టేజ్ సమస్య నెలకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
కొత్త నిర్మాణాలకు విచ్చలవిడిగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నప్పటికీ, కాలనీలో ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని నాయకులు, అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ అమలు మాత్రం జరగడం లేదు. కాలనీలో కొత్త ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకుండా బస్టాండ్ సమీపంలోని ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక భారం మోపుతున్నారు. దీంతో లోడ్ తట్టుకోలేక తరచూ వోల్టేజ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నాయకుల హామీలు ఫలితం లేకుండా…
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో కాలనీలో ఓట్లు వేయాలని కోరుతూ విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ నాయకులు, ఎన్నికల అనంతరం సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రంతా జాగారం…
అయ్యప్పనగర్‌లో రాత్రి వేళల్లో వోల్టేజ్ సమస్య మరింత తీవ్రమవుతోంది. విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, బోర్‌వెల్లు సరిగా పనిచేయడం లేదు. విలువైన విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయి. ఏసీలు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది.
ట్రాన్స్‌ఫార్మర్‌కు స్థలం ఉన్నా ఆలస్యం…
ఇన్నాళ్లుగా స్థలం లేదని చెప్పిన విద్యుత్ అధికారులు, ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ, నరేందర్ సూచించిన స్థలాన్ని గుర్తించినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. స్థలాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, అనుమతి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

