Nagamani Malligari September 2, 2026prabhanews.com
సర్కారు వైఫల్యాలపై శ్రేణుల పోరుబాట..
మహాధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా పురోగతి సాధించలేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు జంగ్ సైరన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం బెల్లంపల్లి కాంటా అంబేద్కర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, వాటిలో భాగమైన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు పలు ఎత్తులు, కుయుక్తులు అనుసరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకూ తీసుకెళ్లేందుకే బీఆర్‌ఎస్ శ్రేణులు పోరుబాట పట్టాయని తెలిపారు.
నియోజకవర్గవ్యాప్తంగా ఎనిమిది రోజులపాటు ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. 420 హామీలను గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టడంతో పాటు.. ప్రజలకు ప్రభుత్వం బాకీ ఉన్న హామీలతో 'బాకీ కార్డులు' ఇంటింటికీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై నియోజకవర్గాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తామని చిన్నయ్య చెప్పారు. సాగునీరు, విద్యుత్, యూరియా, రైతు బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను తిరిగి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల క్యాలెండర్, యువత ప్రకటన అంశాలపై బీఆర్‌ఎస్ ప్రజలను సమీకరించి పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు బడికల రమేష్, దొంగల రాజ్‌కుమార్, బత్తుల అనిత, తిరుమల వాసు, తాండ్ర స్రవంతి, బెడ్డల సౌజన్య, బండారి స్రవంతి, ప్రవీణ్‌కుమార్, ఆసాది మధు, సర్పంచులు అరుణ్, సింగతి రాజేష్, ఎం.డి. ఇబ్రహీం, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు ఏలూరి వెంకటేష్, కొక్కెర చంద్రశేఖర్, చదువుల వెంకటరమణ, గోమాస శ్రీనివాస్, పుల్లూరి మోహన్‌రావు, రేవల్లి విజయ్, మచ్చ రాజేష్, గద్దల ధర్మేందర్, శ్రీరామారావు, మద్దెల గోపికృష్ణ, ఏలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
