Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

BHARATPOL | పరారీల ఆటకట్టు.

Pavan Chandragiri August 4, 2026

  • నేరస్థులపై కేంద్రం ఉక్కుపాదం
  • విదేశాల్లో దాక్కున్న నేరస్థులకు ఉక్కుపాదం..
  • విదేశాలకు పారిపోయినా తప్పించుకోలేరు..
  • పేర్లు మార్చుకున్నా దొరికేస్తారు..
  • టెక్నాలజీతో నేరస్థుల వేట

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పరారీలో ఉన్న నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు సమగ్ర నిఘా, సాంకేతికత ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు హోంశాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్యకాలంలో ప్రపంచంలోని 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగింపజేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నేరస్థులపై కఠిన చర్యల కోసం 2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొంది.

2014కు ముందు భారత్‌కు కేవలం 37 దేశాలతో మాత్రమే ప్రత్యర్పణ ఒప్పందాలు ఉండేవని, ఆర్థిక నేరస్థుల ఆస్తుల స్వాధీనం కోసం ప్రత్యేక చట్టం కూడా లేదని వివరించింది. 2004 నుంచి 2013 మధ్యకాలంలో సగటున ఏడాదికి నలుగురు నేరస్థులనే భారత్‌కు అప్పగించగా, అప్పట్లో 110 ప్రత్యర్పణ అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండేవని పేర్కొంది. గత ప్రభుత్వాల్లో రాజకీయ సంకల్పం లోపించిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న నేరస్థులను తిరిగి రప్పించడం జాతీయ ప్రాధాన్య అంశంగా మారిందని హోంశాఖ స్పష్టం చేసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పరారీలో ఉన్న నేరస్థులపై చర్యలకు ప్రపంచ దేశాలతో సమన్వయం, బలమైన సహకారం, స్మార్ట్ దౌత్యం అనే మూడు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నేరస్థుల సమస్య దేశ సార్వభౌమత్వం, ఆర్థిక స్థిరత్వం, శాంతిభద్రతలు, జాతీయ భద్రతతో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

గత మూడు సంవత్సరాల్లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జారీ గణనీయంగా పెరిగిందని, ఇప్పటివరకు 401 మంది పరారీలో ఉన్న నేరస్థులపై నోటీసులు జారీ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌పోల్ (BHARATPOL) వ్యవస్థను ప్రారంభించి, 1,400కు పైగా భారత సంస్థలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపింది.

దీంతో సమాచారం మార్పిడి సమయం గణనీయంగా తగ్గి 3 నుంచి 10 రోజుల్లోనే సమాచారాన్ని పంచుకునే వీలుకల్పించిందని పేర్కొంది. విదేశాలకు పారిపోయి పేర్లు, గుర్తింపులు మార్చుకుని దాక్కున్న నేరస్థులను గుర్తించేందుకు ఆపరేషన్ త్రిశూల్ కింద ఉపగ్రహ సాంకేతికత, డిజిటల్ ఫుట్‌ప్రింట్లను వినియోగించి వారి ఆచూకీని గుర్తిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News