Sowjanya Anneboina August 29, 2026prabhanews.com
తిర్యాణి, ఆంధ్రప్రభ: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెబ్బెన సీఐ సంజయ్, తిర్యాణి ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం భీమారం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీసులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ప్రజలకు భద్రత, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సంజయ్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని తెలిపారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ సంజయ్ సూచించారు. గంజాయి వినియోగం, విక్రయాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
