Bala Raju August 27, 2026prabhanews.com, Telangana, TG News
- ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు
- ములుగు, భూపాలపల్లిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపైనా ఆరా
- ఇటీవలే ఉత్తమ అధికారిగా అవార్డు.. ఇంతలోనే ఏసీబీ దాడులు
Bhupalpalli | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ (సహాయ సంచాలకులు, గనులు-భూగర్భ శాఖ) బొజ్జ జయరాజ్‌పై ఏసీబీ అధికారులు గురిపెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆయన నివాసంతో పాటు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని మైన్స్ ఏడీ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో జయరాజ్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారా? అనే కోణంలోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
భూపాలపల్లి కార్యాలయంలో…
భూపాలపల్లి కలెక్టరేట్‌లోని మైన్స్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం సంబంధిత రికార్డులు, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోదాలు పూర్తయ్యే వరకు ఏయే ఆస్తులు, నగదు, కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అవార్డు అందుకున్న కొద్ది రోజులకే…
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి జిల్లాలో ఉత్తమ అధికారిగా జయరాజ్ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న కొద్ది రోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోదాల్లో లభించే నగదు, ఆస్తుల వివరాలు, కీలక పత్రాల ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
