Nagamani Malligari September 2, 2026prabhanews.com
పోస్ట్‌మెట్రిక్ దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం.. సద్వినియోగం చేసుకోవాలి
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ శాఖ భీమ్‌గల్ డివిజన్ సీనియర్ ఫార్మసీ అధికారి ఎం.
గంగాధర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పదకొండో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. గతంలో పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా, తాజాగా సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఎం. గంగాధర్ తెలిపారు. బీడీ కార్మికుల కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాల అంతర్జాల వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి వివరాలు, విద్యా ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
బీడీ కార్మికుల పిల్లలకు విద్యాపరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ ఫార్మసీ అధికారి ఎం. గంగాధర్ కోరారు.
