Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బిల్లులకు పూర్తి ఆధారాలు ఉంటేనే సంతకాలు..

Sowjanya Anneboina October 4, 2026prabhanews.com

కడెం,ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్‌లు ఏడు రోజుల పాటు సంతకాలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే సంతకాలు చేసే ముందు సంబంధిత బిల్లులకు పూర్తి ఆధారాలు, ఖర్చుల వివరాలు తప్పనిసరిగా ఉండాలని నిర్మల్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పొద్దుటూరి సంపత్‌రెడ్డి అన్నారు.

ఆదివారం కడెంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం సంతకాలు చేయడానికి ఉప సర్పంచ్‌లకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే సంతకం చేసే బాధ్యత అప్పగించినప్పుడు బిల్లులు, ఖర్చుల వివరాలను పరిశీలించే అవకాశం, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం కూడా కల్పించాలని కోరారు.

తక్కువ ఖర్చుతో పూర్తయిన పనులకు ఎక్కువ మొత్తాలు చూపిస్తూ బిల్లులు తయారు చేసి సంతకాల కోసం ఒత్తిడి చేస్తే అలాంటి బిల్లులపై ఉప సర్పంచ్‌లు సంతకాలు చేయబోరని సంపత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత ఆధారాలను సేకరించి కలెక్టర్‌ను కలిసి వాస్తవాలను వివరిస్తామని తెలిపారు.

ప్రజల సొమ్మును కాపాడాలి

గ్రామపంచాయతీ నిధులు ప్రజల సొమ్మని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని సంపత్‌రెడ్డి అన్నారు. అవినీతి, నిబంధనల ఉల్లంఘనకు ఉప సర్పంచ్‌ల ఫోరం ఎప్పటికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

తాము ఎలాంటి జీతం తీసుకోకుండా గ్రామపంచాయతీల కోసం ప్రజాసేవ చేస్తున్నామని, అలాంటి ఉప సర్పంచ్‌లపై ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాధ్యతలు అప్పగించినప్పుడు వాటికి తగిన అధికారాలు, రక్షణ కూడా కల్పించాలని కోరారు.

నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పులు నిర్ధారణైన సందర్భంలో నిబంధనల ప్రకారం సర్పంచ్‌ల చెక్ పవర్‌పై ప్రభుత్వం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె మధుకర్, మండల అధ్యక్షుడు బండారి జనార్దన్, వర్కింగ్ ప్రెసిడెంట్ దండుగుల యాదగిరి, జిల్లా కార్యదర్శి రెంకల విజయ్ యాదవ్, శ్రీను, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News