Abhi Naga October 23, 2026prabhanews.com
సీఎం ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన గౌరీ శంకర్
అచ్చంపేట అక్టోబర్ 23, (ఆంధ్రప్రభ) : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన పట్ల అచ్చంపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గౌరీ శంకర్ హర్షం వ్యక్తం చేశారు.
ముదిరాజుల చిరకాల డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఆశాజనకమని పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న విజ్ఞప్తిపై రానున్న మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తామని ప్రకటించడం పట్ల గౌరీ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు.
కులగణన ద్వారా బీసీల జనాభా వివరాలను పక్కాగా సేకరించామని, అవసరమైతే ఆ లెక్కలను సవరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొనడం బీసీ వర్గాలకు మరింత బలాన్నిస్తుందని అన్నారు. ముదిరాజుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశిస్తున్నామని గౌరీ శంకర్ తెలిపారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ద్వారా సమగ్ర అధ్యయనం జరిపించి, ముదిరాజుల అభ్యర్థనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆచరణలోకి వచ్చి ముదిరాజులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
