Babu Bahadur October 5, 2026Brazil Election, Brazil Election 2026, Brazil Presidential Election, Flavio Bolsonaro, Flavio Bolsonaro Lead, Jair Bolsonaro, Lula da Silva
Brazil-Election-Flavio-Leads : నరాలు తెగే ఉత్కంఠ Andhra prabha Top Story
- బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో సీన్ రివర్స్
- తొలి రౌండ్‌లో అధికార పార్టీకి షాక్
- ఫ్లావియో ఆధిక్యం
- లూలా వెనుకంజ
- తుది ఫలితానికి 50 శాతం ఓట్లు తప్పనిసరి..
- అక్టోబర్ 25న రెండో రౌండ్?
- ట్రంప్ జోక్యంపై ఆరోపణలు
- అవినీతి, ఆర్థిక ఆందోళనలే ప్రధాన అంశాలు
( బ్రసీలియా/సావో పాలో/రియో డి జనీరో, ఆంధ్రప్రభ )
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బొల్సొనారో అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు, వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడుతున్న ఫలితాలను బట్టి ఇద్దరూ రెండో రౌండ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని డేటాఫోల్హా అంచనా వేసింది.
దాదాపు 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఫ్లావియోకు 48.47 శాతం, లూలాకు 43.49 శాతం ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌లోనే విజయం సాధించాలంటే అభ్యర్థి 50 శాతానికి పైగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. దీంతో ఫ్లావియో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. తుది విజయం కోసం మరోసారి ప్రజలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. ఇటీవలి వరకు వెలువడిన ప్రైవేటు సర్వేలు తొలి రౌండ్‌లో లూలా సుమారు మూడు శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉంటారని అంచనా వేశాయి. అందుకు భిన్నంగా ఓట్ల లెక్కింపులో ఫ్లావియో ముందంజ వేయడం బ్రెజిల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
లూలాపై వ్యతిరేక ఓటు?
ఫ్లావియోకు లభిస్తున్న ఓట్లలో గణనీయమైన భాగం లూలాకు వ్యతిరేకంగా పడుతున్న నిరసన ఓట్లు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రెండో రౌండ్‌లో మాత్రమే ఫ్లావియో వైపు మళ్లుతాయని భావించిన ఓటర్లు.. ఈసారి తొలి రౌండ్‌లోనే ఆయనకు మద్దతు పలికారని అంచనా.
దక్షిణాది రాష్ట్రాల్లో బొల్సొనారో కుటుంబానికి మద్దతు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఓట్ల లెక్కింపు వేగంగా సాగింది. మరోవైపు లూలాకు బలమైన మద్దతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొంత నెమ్మదిగా కొనసాగింది. దీంతో తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది , అక్టోబర్ 25న రెండో రౌండ్ జరిగితే.. లూలా, ఫ్లావియో మధ్య పోరు మరింత హోరాహోరీగా మారే అవకాశముంది. ఇటీవలి సర్వేల్లో ఇద్దరికీ దాదాపు సమానమైన మద్దతు కనిపించింది.
తండ్రి బాటలో ఫ్లావియో
45 ఏళ్ల ఫ్లావియో.. తన తండ్రి జైర్ బొల్సొనారోకు చెందిన కుడిపక్ష రాజకీయ ఉద్యమాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు 80 ఏళ్ల లూలా నాలుగోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు.
అవినీతి ఆరోపణలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక అనిశ్చితి, నేరాలు, అమెరికా జోక్యంపై ఆరోపణలు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. అయితే ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కీలక టీవీ చర్చలకు దూరంగా ఉండటంతో విధానపరమైన చర్చకు పెద్దగా అవకాశం లేకపోయింది.
''తొలి రౌండ్‌లోనే గెలుస్తా''
లూలాపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తనకు అనుకూలంగా మారుతుందని ఫ్లావియో ధీమా వ్యక్తం చేశారు. ''మరో అభ్యర్థికి ఓటేయాలని భావించినా.. లూలాను వ్యతిరేకించే ఓటర్లు నాకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. ఆ ఓట్లు తొలి రౌండ్‌లోనే విజయాన్ని అందిస్తాయని భావిస్తున్నా'' అని ఆయన పేర్కొన్నారు.
సావో పాలోలో ఓటు వేసేందుకు వచ్చిన 41 ఏళ్ల న్యాయవాది థైసీ లిమా.. తాను ఫ్లావియోను ఉత్తమ అభ్యర్థిగా భావించకపోయినా, లూలా వర్కర్స్ పార్టీని అధికారానికి దూరం చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు.
మరోవైపు మినాస్ గెరైస్ మాజీ గవర్నర్ రోమ్యూ జెమాను సమర్థించాలని తొలుత భావించిన 49 ఏళ్ల మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ ఫెర్నాండో టెంపెల్.. చివరకు ఫ్లావియోకే ఓటు వేసినట్లు తెలిపారు.
అమెరికా జోక్యంపై దుమారం
బ్రెజిల్ ఎన్నికల్లో అమెరికా జోక్యంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. లూలా గెలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను గుర్తించకపోవచ్చని ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ అధికారికంగా ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించలేదు. అయితే ఫ్లావియో బొల్సొనారోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, ఆయనపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. ''బ్రెజిల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయంగా, బయట నుంచి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది'' అని బ్రసీలియాలో ఓటు వేసిన క్రిస్టియానో అనే 34 ఏళ్ల వైద్యుడు అన్నారు.
లూలా మాత్రం దేశ సార్వభౌమత్వమే కీలకమని పేర్కొన్నారు. ''బ్రెజిల్ భవిష్యత్తు ఇప్పుడు పణంగా ఉంది'' అని ఓటు వేసిన అనంతరం వ్యాఖ్యానించారు.
అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోందని బ్రెజిల్ ఎన్నికల కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాసియో న్యూనెస్ మార్కెస్ తెలిపారు. అంతర్జాతీయ ముప్పులను పర్యవేక్షిస్తున్న బృందాలకు ఎలాంటి ప్రమాదం కనిపించలేదని వెల్లడించారు.
ఆర్థిక సమస్యలే ప్రధాన అస్త్రం
లూలా ప్రభుత్వ హయాంలో అసమానతలు, నిరుద్యోగం తగ్గినప్పటికీ.. జీవన వ్యయం, కుటుంబాలపై పెరుగుతున్న రుణభారం, వీధి నేరాలు, గ్యాంగ్‌ల ప్రభావం వంటి సమస్యలు ఆయనకు ప్రతికూలంగా మారాయి.
ఫ్లావియో ఈ అంశాలనే తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజల చేతుల్లో డబ్బు మిగలడం లేదని, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. బ్రెజిల్ ప్రభుత్వ రుణభారం జీడీపీలో 82 శాతాన్ని దాటడం ఆర్థిక ఆందోళనలకు దారితీసింది. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రభుత్వం వరుసగా 2.0 శాతం, 2.3 శాతానికి తగ్గించింది.
''బ్రెజిల్ మళ్లీ వృద్ధి బాట పట్టాలనే ఉద్దేశంతోనే ఓటు వేశాను'' అని బ్రసీలియాకు చెందిన 52 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి మార్సియానో డి సౌజా ఇ సిల్వా తెలిపారు. గతంలో లూలాకు మద్దతిచ్చిన ఆయన.. 2018, 2022లో జైర్ బొల్సొనారోకు, ఇప్పుడు ఫ్లావియోకు ఓటు వేశారు.
బ్యాంక్ మాస్టర్ కుంభకోణం
ఎన్నికల ప్రచారాన్ని బ్యాంకో మాస్టర్ కుంభకోణం కూడా కుదిపేసింది. ఇప్పుడు మూతపడిన ఈ బ్యాంకుకు సంబంధించిన భారీ ఆర్థిక మోసం కేసు బ్రెజిల్ రాజకీయ వర్గాలను చుట్టుముట్టింది. బ్యాంకు అధిపతి డానియెల్ వోర్కారోను ఈ ఏడాది అరెస్టు చేశారు. బహుళ బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మొరేస్ నుంచి ఫ్లావియో బొల్సొనారో వరకు పలువురితో బ్యాంకర్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు సాగుతోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఫ్లావియోపై ఫెడరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన తండ్రిపై సినిమా తీసేందుకు వోర్కారో నుంచి కోట్లాది రూపాయలు సమీకరించిన విషయాన్ని మాత్రం అంగీకరించారు. వోర్కారోకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొరేస్‌కు ఉన్న సంబంధాలు కూడా రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మొరేస్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని చెబుతున్నారు.
కాంగ్రెస్ ఎన్నికలూ కీలకమే
అధ్యక్ష ఎన్నికలతో పాటు బ్రెజిల్‌లో 513 మంది దిగువ సభ సభ్యులు, సెనేట్‌లో మూడింట రెండొంతుల స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
2016లో లూలా మద్దతుదారు, అప్పటి అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్ అభిశంసనకు గురైన తర్వాత బ్రెజిల్ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యం మరింత పెరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొరేస్‌పై అభిశంసనకు డిమాండ్ చేస్తున్న పలువురు ఎంపీలు ఉండటంతో ఈసారి పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది. ఫ్లావియో ఆధిక్యం కొనసాగుతుందా? లూలా పుంజుకుంటారా? అన్నదే ఇప్పుడు బ్రెజిల్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్నగా మారింది. తొలి రౌండ్ ఫలితాల అనంతరం.. అక్టోబర్ 25న జరిగే అవకాశం ఉన్న తుది పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
