Pavan Chandragiri August 27, 2026
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నేపాల్‌ను మరోసారి భూకంపం తాకింది. గురువారం రాత్రి ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో ఈ భూకంపం ఆందోళన కలిగించింది.
బుధవారం సంభవించిన భోటెకోషి నది ఆకస్మిక వరదలు నేపాల్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యికి పైగా మంది గల్లంతైనట్లు సమాచారం. వరదల నేపథ్యంలో నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రులు, సహాయ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారు. పలువురు విదేశీయులు కూడా ఈ వరదల్లో గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.
33 దేశాలకు చెందిన 596 మంది వరదల కారణంగా గల్లంతైనట్లు భారత్‌లోని నేపాల్ రాయబార కార్యాలయం తెలిపింది. గల్లంతైన వారి వివరాలను సేకరించడం, బాధితులకు సహాయం అందించడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వరదల వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్ ప్రజలలో ఈ భూకంపం మరింత ఆందోళనను రేకెత్తించింది. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా, ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
