Bala Raju September 2, 2026prabhanews.com, Telangana, TG News
1000 రోజుల పాలనలో చేసిందేమీ లేదు..
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు
BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో 'ఛార్జ్‌షీట్' విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
క్షీణించిన శాంతిభద్రతలు..
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున దాడులు, హత్యలు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పట్టపగలే కారుతో సామాన్యులను ఢీకొట్టి చంపిన ఘటనల్లోనూ కేసులు నమోదు చేయకుండా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు.
కంటోన్మెంట్‌లోని మిలిటరీ స్థావరంలోనూ దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని కేటీఆర్ పేర్కొన్నారు. మిలిటరీ స్థావరానికే భద్రత లేకుండా పోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదని విమర్శించారు.
కొనసాగుతున్న అత్యలు, హత్యాచారాలు…
మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పోక్సో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరికి అధికార పార్టీ నేతల అండదండలు లభిస్తున్నాయని, నిందితులకు ఆశ్రయం కల్పించారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహకరించారని కేటీఆర్ చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు.
అభివృద్ధిలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం..
అభివృద్ధి విషయంలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప కొత్తగా ఏమీ నిర్మించలేదని అన్నారు. ఒక్క చిన్న చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని ఆరోపించారు.
నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు…
రాష్ట్రంలో భారీగా అప్పులు చేసినప్పటికీ అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపిస్తూ.. ఇంత అప్పు చేసినా ఒక్క ఇటుక కూడా కొత్తగా పెట్టలేదని, ఒక్క చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని వ్యాఖ్యానించారు.
మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే 'ఛార్జ్‌షీట్' విడుదల చేసినట్లు తెలిపారు.
