Abhi Naga October 4, 2026prabhanews.com
రూ.4 వేల కోట్ల మైనారిటీ బడ్జెట్ హామీ ఏమైంది? : హరీశ్
- కేసీఆర్ హయాంలో రూ.1,800 కోట్లకు పెరిగిన బడ్జెట్..
- ఇప్పుడు రూ.1,300 కోట్లే ఖర్చు చేస్తున్నారని ఆరోపణ
- ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, కల్యాణలక్ష్మిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి
గజ్వేల్, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను తీవ్రంగా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మైనారిటీల కోసం రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, అనేక హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ తుర్కకాశ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్‌లో నిర్వహించిన హక్కుల సాధన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
రూ.4 వేల కోట్ల హామీ ఏమైంది?
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ కేవలం రూ.300 కోట్లుగా ఉండేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో దశలవారీగా బడ్జెట్‌ను పెంచి రూ.1,800 కోట్లకు తీసుకెళ్లారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ప్రస్తుతం రూ.1,300 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా తుర్కకాశ్, ముస్లిం మైనారిటీలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందడం లేదని విమర్శించారు. గత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లపై విమర్శలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంగా మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అమలు చేసిందని హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మైనారిటీ విద్యార్థులకు సుమారు రూ.1,550 కోట్ల మేర ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి ప్రాధాన్యం తగ్గించిందని ఆరోపించారు. గత మూడేళ్లలో కేవలం రూ.14 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. మైనారిటీ కార్పొరేషన్ ఉద్యోగులకు ఏడు నెలలుగా, ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు ఏడాదిగా జీతాలు అందడం లేదని ఆరోపించారు.
గజ్వేల్ అభివృద్ధిపై ప్రస్తావన
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మతాలకతీతంగా అన్ని వర్గాలను సమానంగా చూశారని హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌లో గతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంటింటికీ నల్లా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతుల సాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులతో పాటు చెక్‌డ్యామ్‌లు, కాల్వల నిర్మాణం చేపట్టి సాగునీటిని అందించామని తెలిపారు.
'కాంగ్రెస్ తెచ్చిన కరువు'
గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేసిన హరీశ్‌రావు.. ఆయన మాటలు తరచూ మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, బాండ్ పేపర్లపై రాసిచ్చారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు బకాయిలు చెల్లించాలి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.1,260 కోట్లు ఖర్చు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం.. ముందుగా నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా నీటిని తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
కల్యాణలక్ష్మిపై ప్రభుత్వాన్ని నిలదీత
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని హరీశ్‌రావు అన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 13.50 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుని చెక్కుల కోసం ఎదురుచూస్తున్న సుమారు రెండు లక్షల మంది ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
