Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Car Price Hike | సెప్టెంబర్‌ నుంచి కార్ల ధరల మోత..

Pavan Chandragiri August 23, 2026

  • సెప్టెంబర్‌ 1 నుంచి పెరగనున్న ధరలు
  • హ్యుందాయ్‌, టాటా వాహనాలు మరింత ప్రియం
  • హ్యుందాయ్‌ కార్లపై 1 శాతం వరకు పెంపు..
  • టాటా కార్లపై రూ.25 వేల వరకు భారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి సెప్టెంబర్‌ నుంచి అదనపు భారం పడనుంది. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, టాటా మోటార్స్‌ తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరుగుతున్న ముడి సరకు ధరలు, ఉత్పత్తి వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.

హ్యుందాయ్‌ కార్ల ధరలు 1 శాతం వరకు పెంపు

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సెప్టెంబర్‌ 2026 నుంచి తన అన్ని మోడళ్లపై గరిష్ఠంగా 1 శాతం వరకు ధరలను పెంచనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఖర్చుల పెరుగుదల మొత్తాన్ని వినియోగదారులపై మోపకుండా కొంత భారాన్ని తామే భరిస్తున్నామని, మిగిలిన కొంత ప్రభావాన్ని మాత్రమే ధరల పెంపు రూపంలో బదిలీ చేస్తున్నామని హ్యుందాయ్‌ పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్‌ దేశీయ మార్కెట్లో గ్రాండ్‌ ఐ10 నియోస్‌ నుంచి ఐయోనిక్‌-5 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ధరల పెంపు ఆయా మోడళ్లపై, వేరియంట్ల ఆధారంగా ఉంటుంది.

2026లో హ్యుందాయ్‌కు మూడోసారి పెంపు

హ్యుందాయ్‌ ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ధరలను సవరించింది. జనవరి 1 నుంచి 0.6 శాతం వరకు ధరలను పెంచగా.. ఏప్రిల్‌లో మరోసారి 1 శాతం వరకు పెంపును ప్రకటించింది. ఆ పెంపు జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో మోడల్‌, వేరియంట్‌ను బట్టి రూ.12,800 వరకు ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా కంపెనీ ఎగుమతులపై ప్రభావం పడింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హ్యుందాయ్‌ ఎగుమతులు 19.6 శాతం తగ్గి 38,708 యూనిట్లకు చేరాయి.

టాటా కార్లు మరింత ప్రియం..

కారు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా మోటార్స్‌ షాక్‌ ఇచ్చింది. దేశీయ ప్రయాణికుల వాహన విభాగంలో ప్రముఖ సంస్థ అయిన టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) తమ కార్లు, ఎస్‌యూవీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గరిష్ఠంగా రూ. 25,000 వరకు ధరల పెంపును ప్రకటించిన కంపెనీ.. పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ పెంపు టాటా మోటార్స్‌ అందిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా వర్తించనుంది. అయితే మోడల్‌, వేరియంట్‌ ఆధారంగా ధరల పెరుగుదలలో తేడా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ముడి సరకు ధరలే కారణం

ఉక్కు, అల్యూమినియం, బ్యాటరీల వంటి ముడి సరుకుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని టాటా మోటార్స్‌ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల్లో కొంత భాగాన్ని మాత్రమే వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ సెల్‌ ధరలు 2026 జూన్‌ త్రైమాసికంలో సుమారు 10 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. విదేశీ మారకపు విలువల్లో మార్పులు, ఇతర వ్యయాలు కూడా కంపెనీపై ప్రభావం చూపినట్లు తెలిపింది.

అదే బాటలో మరిన్ని కంపెనీలూ ?

సెప్టెంబర్ నెలలో హ్యుందాయ్‌, టాటా కంపెనీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడంతో.. మారుతీ సుజుకీతో పాటు మరికొన్ని వాహన సంస్థలు కూడా త్వరలో ధరలను సవరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముడి సరకు ధరలు, తయారీ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కార్ల కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారం పడే పరిస్థితి కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News