Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

checkdam| యూనిట్‌కు రూ.12 పెట్టైనా కరెంటు కొంటాం : పొంగులేటి

Abhi Naga October 3, 2026prabhanews.com

యూనిట్‌కు రూ.12 పెట్టైనా కరెంటు కొంటాం : పొంగులేటి

  • పేదోడి ప్రజా ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కాదు
  • అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
  • పాలేరు వాగుపై చెక్‌డ్యామ్‌తో రైతులకు ఎంతో మేలు
  • 250 ఎకరాలకు సాగునీరు!
  • రూ.6.65 కోట్లతో నిర్మాణం పూర్తి..
  • ప్రారంభించిన మంత్రి పొంగులేటి
  • కట్టుకాచారంలో 35 నెలల్లో రూ.13.50 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులు
  • తొలి విడతలో 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేశామన్న మంత్రి

నేలకొండపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై రూ.6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ చెక్‌డ్యామ్‌ అందుబాటులోకి రావడంతో సుమారు 250 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగడంతోపాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

రూ.2.50 కోట్లతో బీటీ రోడ్డు

చెక్‌డ్యామ్‌ ప్రారంభంతో పాటు కట్టుకాచారం పీపీవీ నుంచి బట్టుకుంటవాగు వరకు రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాయగూడెం నుంచి తక్కెళ్లపాడు వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు, గ్రామ అంతర్గత రోడ్లకు రూ.52 లక్షలు, విద్యుత్‌ లైన్ల మార్పిడికి రూ.7.50 లక్షలు, తాగునీటి వసతులకు రూ.3.50 లక్షలు, అంగన్‌వాడీ భవనం తదితర పనులకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

35 నెలల్లో రూ.13.50 కోట్ల పనులు

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో కట్టుకాచారం గ్రామంలో సుమారు రూ.13.50 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు పొంగులేటి తెలిపారు. అనంతరం 31 మంది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

విద్యుత్‌ కోసం ప్రత్యామ్నాయ వనరులు

దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని మంత్రి అన్నారు. నీటి కొరత పరిస్థితుల్లో చెక్‌డ్యామ్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలు రైతులకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తికి ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సౌర, పవన తదితర ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. అవసరమైతే యూనిట్‌కు రూ.12 చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

'పేదోడి ప్రజా ప్రభుత్వం'

గత పాలకుల తరహాలో తమది దొరల ప్రభుత్వం కాదని.. పేదలకు అండగా ఉండే ప్రజా ప్రభుత్వమని పొంగులేటి అన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని తెలిపారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇళ్లలో 2.25 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు.

కలెక్టర్‌ పరిశీలన

జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెక్‌డ్యామ్‌ను నిర్ణీత కాలంలో పూర్తి చేయడంలో అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది కృషి చేశారని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News