Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చెరువుల పునరుద్ధరణకు కొత్త ప్రణాళిక

Pavan Chandragiri August 29, 2026

  • రేవంత్ రెడ్డి చేతికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ నివేదిక..
  • చిన్న నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణకు సూచనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో చెరువుల పరిరక్షణ, చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతం దిశగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కీలక సూచనలు చేసింది. చిన్న నీటిపారుదల వ్యవస్థను ప్రత్యేకంగా పునరుద్ధరించడంతో పాటు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను సమన్వయం చేస్తూ కమాండ్‌ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థను తీసుకురావాలని సిఫారసు చేసింది.

చిన్న నీటిపారుదలపై రూపొందించిన నివేదికను కమిషన్ ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించింది. ఈ సందర్భంగా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్‌, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, గంగాధర్‌, ఎం. భవానీరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ రంగ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత అవసరమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని సూచించింది. చెరువుల పూర్తి నీటి నిల్వ మట్టం సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి శాశ్వతంగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, చిన్న చెరువులు, ఇతర చిన్న నీటి వనరులను పెద్ద నీటిపారుదల వ్యవస్థలతో అనుసంధానించే విధానాన్ని రూపొందించాలని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సందర్భంగా గత రెండేళ్లలో కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, వివిధ అంశాలపై ప్రభుత్వానికి అందించిన సూచనలను కమిషన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కమిషన్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

అదే సమయంలో వ్యవసాయ రంగంలో పంటల మార్పిడిపై మరింత దృష్టి పెట్టాలని, ఉద్యానవన పంటల సాగును పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపైనా కమిషన్ ప్రత్యేకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. చెరువుల పునరుద్ధరణతో పాటు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే అంశాలపై కూడా కమిషన్ మరింత దృష్టి సారించాలని సీఎం సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News