Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చెట్టునడుగు.. పుట్టనడుగు.. అభివృద్ధే చెబుతుంది!

Rama Rao September 2, 2026Telangana

బీఆర్‌ఎస్‌ సమరభేరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

మార్పు పేరుతో మోసపోయాం.. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి: భువనగిరి నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ''చెట్టునడుగు, పుట్టనడుగు.. రోడ్డునడుగు, కరెంట్‌ పోలునడుగు.. శేఖరన్న చేసిన అభివృద్ధి చెబుతుంది'' అంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆయన ఉత్సాహం నింపారు. బుధవారం బీఆర్‌ఎస్‌ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలోని ప్రిన్స్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహించిన సమరభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ చేసిన జిమ్మిక్కులతో ప్రజలు మోసపోయారని, మార్పు పేరుతో నేడు గోసపడుతున్నారని విమర్శించారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజల కోసం మంచి పాలన అందించాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఏం చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

శేఖర్‌రెడ్డి వస్తే.. భువనగిరిలో తిరగలేరు

భువనగిరి నియోజకవర్గ ప్రజలు అనిల్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. ''మాటిమాటికి శేఖర్‌రెడ్డి వస్తలేడు అని మాట్లాడుతున్నారు.. శేఖర్‌రెడ్డి వస్తే భువనగిరి నియోజకవర్గంలో ఇక మీరు తిరగలేరు'' అంటూ వ్యాఖ్యానించారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

అభివృద్ధే శేఖరన్న పాలనకు గుర్తింపు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శేఖరన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనతో నియోజకవర్గ రూపురేఖలు మారాయని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. రహదారుల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యుత్‌ సదుపాయాల మెరుగుదల వంటి పనులు ప్రజలకు గుర్తుండిపోయాయని తెలిపారు.

రైతులకు మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ శేఖర్‌రెడ్డి పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపిస్తోందని, కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

సమన్వయం లేకపోవడంతోనే ఓటమి

సాధారణ ఎన్నికల్లో పరాజయానికి సరైన సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడం, ప్రచార వ్యూహాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని తెలిపారు.

అంతర్గత విభేదాలు, సమాచార లోపం ప్రత్యర్థులకు అనుకూలంగా మారిందన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ బలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

సమరభేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలి

కేటీఆర్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న సమరభేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ఐదు రోజుల పాటు మండలాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, రాష్ట్ర నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కిష్టయ్య, ఏవి కిరణ్‌, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, కర్రె వెంకటయ్య, ర్యాకల శ్రీనివాస్‌, సట్టు తిరుమలేష్‌, గుంటి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News