Babu Bahadur August 27, 2026Chilakaluripet Accident, Chilakaluripet Road Accident
Chilakaluripet-Road-Accident-7-dead : వేలూరు కంటతడి..
Andhra Prabha Crime News
- పుట్టిన రోజు వేడుక ఆనందం ఆవిరి
- ఆటో..ప్రైవేటు బస్సు క్రాష్
- ఏడుగురు దుర్మరణం
- ఏపీ సీఎం దిగ్ర్భాంతి
- డిప్యూటీ సీఎం తీవ్ర విచారం
చిలకలూరిపేట టౌన్ , ఆంధ్రప్రభ)
Chilakaluripet-Road-Accident-7-dead : పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరు నుంచి వేలూరు గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.
పుట్టినరోజు ఫంక్షన్‌లో పాల్గొని తిరుగు ప్రయాణమైన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ సడన్‌గా మలుపు తిప్పడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అర్బన్ సీఐ పి. రమేష్, ఎస్‌ఐలు హజరత్తయ్య, సోమేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
డిప్యూటీ సీఎం విచారం
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
చలించిన మంత్రి
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం అత్యంత దురదృష్టకరం
ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు మంత్రి బీసీ జనార్థనరెడ్డి ఆదేశించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం, నిండు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుందిఈ క్రమంలో ప్రయాణాల వేళ ప్రజలు, వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి, అని మంత్రి సూచించారు.
