Pavan Chandragiri October 23, 2026
సంగారెడ్డి, (ఆంధ్రప్రభ) :
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘనకు మరో ఇద్దరు అమాయక కార్మికుల ప్రాణాలు బలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని "సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్" పరిశ్రమలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) అత్యంత తీవ్రంగా స్పందించింది. ఇద్దరి ప్రాణాలు తీసిన ఈ ఘటనపై శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధికారులు, పరిశ్రమ మూసివేతకు (Closure Order) తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
పరిశ్రమలో ఉత్పత్తి కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసేలా విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) అధికారులను పీసీబీ ఆదేశించింది.
అసలేం జరిగింది?
పరిశ్రమ యాజమాన్యం మరియు పీసీబీ అధికారుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 22వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ప్రొడక్షన్ బ్లాక్-2లో ఈ ఘోరం జరిగింది. మొదటి అంతస్తులోని రియాక్టర్ నుంచి కింది అంతస్తులోని రిసీవర్‌కు క్లోరోఫామ్‌ను బదిలీ చేస్తూ, ద్రవ పొరలను వేరుచేసే (Liquid Separation) ప్రక్రియలో క్లోరోఫామ్ లీక్ అయ్యింది. లీకైన క్లోరోఫామ్ విష వాయువులు/ఆవిరి వేగంగా పరిసర ప్రాంతమంతా వ్యాపించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు తీవ్ర అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితులను వెంటనే నారాయణ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
విచారణకు ముందే మూసివేత ఉత్తర్వులు..
ప్రమాద సమాచారం అందుకున్న టీజీపీసీబీ ఉన్నతాధికారులు శుక్రవారం సరాకా లాబొరేటరీస్‌లో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమ జనరల్ మేనేజర్ మధు, డిప్యూటీ జీఎం యోగేశ్వర్‌రావు నుంచి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమాచారం సేకరించారు. ఘటన తీవ్రతను, యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. కనీసం ముందస్తు విచారణకు అవకాశం కూడా ఇవ్వకుండా అక్టోబర్ 23నే (శుక్రవారం) మూసివేత ఉత్తర్వులు జారీ చేసి తమ కఠిన వైఖరిని చాటారు. ఈ ఘటనతో బొల్లారం, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతాల్లో రసాయనాల నిర్వహణ, కార్మికుల భద్రతపై స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
