Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

CWG 2026 : బాక్సింగ్‌లో భారత్ పంచ్..

Pavan Chandragiri August 2, 2026

ఆంధ్రప్రభ : కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత బృందం చరిత్ర సృష్టించింది.

కామన్వెల్త్ గేమ్స్ లోని 10వరోజు మొత్తం 7 స్వర్ణాలు, 3 రజత పతకాలతో భారత బాక్సింగ్ జట్టు పోటీలను ముగించింది. అథ్లెటిక్స్‌లో కూడా భారత్ సత్తా చాటుతూ… గోల్డ్ పతకం దక్కించుకుంది. ఈ విజయాలతో భారత్ మొత్తం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 38 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

బాక్సింగ్‌లో ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుష్ పంఘాల్ (80 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు.

కాగా, భారత్‌కు తొలి స్వర్ణాన్ని మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ అందించింది. కెనడాకు చెందిన స్కార్లెట్ సవానా డెల్గాడోపై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది.

మహిళల 51 కేజీల ఫైనల్లో సాక్షి చౌదరి ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0తో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై 5-0తో విజయం సాధించి స్వర్ణం అందుకుంది.

మహిళల 60 కేజీల ఫైనల్లో ప్రియ గంగాస్ కెనడాకు చెందిన మేరీ-బతౌల్ అల్-అహ్మదియెపై 4-1తో గెలిచి మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసింది.

మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఇంగ్లండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌ను 5-0తో చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది.

పురుషుల విభాగంలో సచిన్ సివాచ్ 60 కేజీల ఫైనల్లో నమీబియాకు చెందిన ట్రైఅగైన్ మార్నింగ్ న్డెవెలోపై 3-2 తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు.

అనంతరం జరిగిన 80 కేజీల ఫైనల్లో అంకుశ్ పంఘాల్ ఇంగ్లండ్‌కు చెందిన డిమేజి షిట్టుపై విజయం సాధించి భారత్‌కు ఏడో స్వర్ణ పతకాన్ని అందించాడు.

మూడు రజత పతకాలు…

పురుషుల 55 కేజీల ఫైనల్లో జాదుమణి సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో 0-5తో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 75 కేజీల ఫైనల్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గొహైన్ ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో 1-4తో ఓడి రజతం సాధించింది. పురుషుల 90+ కేజీల ఫైనల్లో నరేందర్ బెర్వాల్ ఇంగ్లండ్‌కు చెందిన డామర్ థామస్ చేతిలో 0-5తో ఓడిపోయి రజత పతకం గెలుచుకున్నాడు. భారత బాక్సర్ల ఈ అద్భుత ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన బాక్సింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గ్లాస్గో 2026 నిలిచింది. దీంతో భారత బాక్సింగ్ జట్టు ప్రచారం 7 స్వర్ణాలు, 3 రజతాలతో ముగిసింది.

మరో స్వర్ణం

అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్-57 షాట్‌పుట్ విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభమ్ జుయాల్ రజత పతకం గెలిచి భారత్‌కు ఒకటి-రెండు స్థానాలు అందించారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు తిరుమారన్ కాంస్యం సాధించారు. జూడోలో ఉన్నతి శర్మ మహిళల 63 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి భారత్‌కు మరో పతకాన్ని అందించింది. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడోలో భారత క్రీడాకారుల వరుస విజయాలతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బలమైన సవాల్ విసురుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News