Rama Rao September 2, 2026Telangana
పేదల సంక్షేమానికి వైఎస్సార్ విశేష కృషి
17వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన నాయకులు
పరకాల, ఆంధ్రప్రభ: పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీలో కొత్త తరం నాయకులను తయారు చేసిన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను అన్నారు.
వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ మడికొండ శ్రీను వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన సాగిస్తూ పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గూడెల్లి సదన్‌కుమార్, నాయకులు అల్లం రఘు, నారాయణ, బొచ్చు భాస్కర్, లక్కం వసంత శంకర్, దాసరి ఉమా, పసుల బంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
