Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

దళారులను నమ్మి మోసపోవద్దు

Nagamani Malligari September 22, 2026prabhanews.com

భూ వ్యవహారాలు చట్టబద్ధంగా నిర్వహించుకోవాలి

మ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు స్వస్తి పలికినప్పటికీ, తిరిగి దళారులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే వదంతులు తమ దృష్టికి వచ్చాయని డిప్యూటీ కలెక్టర్‌ (ట్రైనీ), దమ్మపేట తహశీల్దార్‌ మద్దినేని మురళి తెలిపారు.

మండలంలోని రైతులు, భూ హక్కుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొందరు దళారులు ప్రస్తుత తహశీల్దార్‌ పదవిలో కొంతకాలమే ఉంటారని, తిరిగి తమకు అనుకూలమైన వ్యక్తులే తహశీల్దార్‌గా వస్తారని రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ప్రచారాలను రైతులు, భూ హక్కుదారులు నమ్మవద్దని కోరారు.

భూ బదిలీలు, పట్టా పుస్తకాలు, పాస్‌బుక్కులు తదితర భూ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలైనా పూర్తిగా చట్టబద్ధంగా, రెవెన్యూ చట్టాలు, నిబంధనలకు లోబడి మాత్రమే నిర్వహించుకోవాలని మురళి సూచించారు. ఎవరైనా దళారులు భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పాస్‌బుక్కులు ఇప్పిస్తామని, భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తే వారి మాటలు నమ్మవద్దన్నారు. ముందుగా దమ్మపేట తహశీల్దార్‌ కార్యాలయంతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

దమ్మపేట తహశీల్దార్‌ కార్యాలయంలో దళారీ వ్యవస్థకు ఎలాంటి అవకాశం లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని మురళి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తుల కార్యకలాపాలపై ఇప్పటికే నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండి దళారుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సీతారామ ప్రాజెక్టు నిర్వాసితుల రికార్డులపై సమీక్ష

దమ్మపేట తహశీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం సీతారామ ప్రాజెక్టు ఎడమ కాలువ భూ నిర్వాసితుల రికార్డులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలపై చర్చించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News