Pavan Chandragiri September 23, 2026
- తొమ్మిది రోజుల వైభవంగా వేడుకలు..
- బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహణ
తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజాన్ని అవరోహణం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున నిర్వహించే ధ్వజావరోహణం కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సమస్త దేవతలను తిరిగి తమ లోకాలకు సాగనంపే సంకేతంగా ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
అంతకుముందు రాత్రి 7 గంటలకు శ్రీవారి బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు, టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారిని దర్శించుకున్నారు.
