Nagamani Malligari October 4, 2026prabhanews.com
గుంపులుగా సంచారం..
చిన్నారులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు
పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది.
గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వందకు పైగా కుక్కలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుక్కలు చిన్నారులను వెంబడించడంతోపాటు పలువురిని కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు. వృద్ధులు, మహిళలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంబడిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల సమస్యను గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. కేవలం ఫిర్యాదులకు పరిమితం కాకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి కుక్కల నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారులు, వృద్ధుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అధికారులు ఇక ఆలస్యం చేయకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామసభలో ఈ సమస్యపై ప్రత్యేకంగా చర్చించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలు, యువత కూడా అధికారులకు సహకరించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు.
