Srinivas April 6, 2026Hyderabad crime news, Hyderabad Drugs Case, Moinabad Farmhouse Drugs Case, prabha news.com
డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల కస్టడీకి సంబంధించిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ఉప్పరపల్లి కోర్టు విచారించనుంది. కేసు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించేందుకు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నట్లు సమాచారం. మార్చి నెలలో సంచలనం రేపిన ఈ కేసులో డ్రగ్స్ వినియోగం, సరఫరా నెట్‌వర్క్, ఆయుధ వినియోగం వంటి పలు కోణాలపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా ఏర్పాటైంది.
ఇప్పటికే నిందితులను పలు దఫాల్లో విచారించిన పోలీసులు, మరిన్ని వివరాలు వెలికితీయడానికి అదనపు కస్టడీ అవసరమని భావిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా మార్గాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై స్పష్టత కోసం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. కోర్టు కస్టడీ మంజూరు చేస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

