Nagamani Malligari October 24, 2026prabhanews.com
నీటిని పొదుపుగా వాడుతూ పర్యావరణాన్ని కాపాడాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్‌లోని పలు వార్డుల్లో అవగాహన సభలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలో ఎల్ నినో ప్రభావం, తాగునీటి కొరత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం పలు వార్డుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. పైపుల లీకేజీలను అరికట్టడం, గేట్ వాల్వులను మార్చుకోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలతో నీటి వృథాను నివారించవచ్చని సూచించారు. కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ గాలి, నీరు, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు బాధ్యతగా మెలగాలని కోరారు.
లక్కారం 8వ వార్డులోని వార్డు కార్యాలయం వద్ద కౌన్సిలర్ బద్రి గాలయ్య అధ్యక్షతన, కమిషనర్ సమక్షంలో సభ నిర్వహించారు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. తంగడపల్లిలోని 4, 5, 6, 15వ వార్డుల సభలను గ్రామపంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కొయ్యాల శేఖర్, ఆలే శ్రీలత చిరంజీవి, గడ్డం ఇందిరా రాజరత్నం ఆధ్వర్యంలో నిర్వహించి ఎల్ నినో ప్రభావం నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చౌటుప్పల్ పట్టణంలోని 9, 10, 11, 19వ వార్డుల సభలు చౌటుప్పల్ కచేరీ వద్ద చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, కాలనీవాసులు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
12, 13వ వార్డుల్లో వినాయక మండపం వద్ద కౌన్సిలర్లు ఒకపాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ కే. హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ ఎం. రేణు కుమార్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జవాన్లు, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
