Nagamani Malligari April 7, 2026Chief Minister
ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం…
రాజధాని అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉంది
చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో "అమరావతి పవిత్ర జల హారతి" మహోత్సవం..ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి యువ నాయకులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుమారుడు కేశినేని వెంకట్ అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమున్నత అభివృద్ధిని కాంక్షిస్తూ, నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో "అమరావతి పవిత్ర జల హారతి" మహోత్సవం* విజయవాడ దుర్గా ఘాట్ లో మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేశినేని వెంకట్ పవిత్ర కృష్ణానదికి జల హారతి ఇచ్చారు. ముందుగా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం సభ్యులు రాష్ట్ర రాజదాని అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సాగాలని సంకల్పిస్తూ రామానుజాచార్యుల విగ్రహాం వద్ద తిరుప్పావై పారాయణం చేశారు. అనంతరం కేశినేని వెంకట్ రామానుజాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే కేశినేని వెంకట్, చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం సభ్యులతో కలిసి రాష్ట్ర రాజదాని అమరావతి కి చట్టబద్దత కల్పించినందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వంతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్ల కార్డులు ప్రదర్శించి తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ…. ఆంధ్ర రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందటం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు అన్ని ప్రముఖ పార్టీల సహకారం లభించడం రానున్న కాలంలో అమరావతి అభివృద్ధికి సంకేతం అన్నారు.
అమరావతి రానున్న కాలంలో ప్రపంచంలోనే మేటి నగరం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రూపుదిద్దు కుంటుందని తెలిపారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా విజయవాడ నగరాన్ని సైతం గ్రేటర్ విజయవాడ గా చేయాలని ఈ సందర్భంగా కేశినేని వెంకట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, మధురాంతకం శ్రీనివాసరావు మాట్లాడుతూ… అమరావతి శాశ్వత రాజధానిగా రూపు దిద్దుకుంటున్న శుభ సమయంలో తాము సైతం అమరావతి రాజధాని నిర్మాణం ఎటువంటి నిర్విఘ్నం లేకుండా సక్రమంగా జరగాలని పూజలు చేస్తున్నామన్నారు.
ఆ క్రమంలోనే జలహారతి కార్యక్రమాన్ని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలోని పవిత్ర కృష్ణానది తీరంలో దుర్గా ఘాట్ నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాత్తాద శ్రీ వైష్ణవులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం అందిస్తే, విజయవాడ వంటి నగరంలో డివిజన్ అధ్యక్షులుగా, పశ్చిమ నియోజకవర్గంలో ఓ విభాగానికి అధ్యక్షులుగా తమ కులస్తులను నియమించి రాజకీయంగా చేయూత అందిస్తున్న నాయకులు ఎంపీ కేశినేని చిన్ని అంటూ ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి రాజధాని బిల్లు సమయంలో ఎంపీగా కేశినేని చిన్ని ఉండటం, బిల్లుకు మద్దతు తెలుపటం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. విజయవాడ గ్రేటర్ గా కూడా ఎంపీ కేశినేని చిన్ని నేత్రత్వంలోనే జరగాలని తామంతా కోరుకున్నట్లు వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైష్ణవ గురువర్యులు తిన్నలూరి ప్రసాద్,సూరేపల్లి రాము, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు, వివిధ విభాగాలకు బాధ్యులు పాల్గొన్నారు.

