Abhi Naga August 31, 2026prabhanews.com
8 లక్షల మంది విద్యార్థుల డిమాండ్..
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
విద్యార్థుల లేఖలతో సీఎం రేవంత్‌కు రామచందర్‌రావు విజ్ఞప్తి
బకాయిల కోసం 48 గంటల నిరాహార దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి అందిన వినతిపత్రాలను స్వయంగా సీఎంకు అందించేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలకుపైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తనకు లేఖలు అందజేశారని రామచందర్‌రావు తెలిపారు. విద్యార్థుల తరఫున అందిన ఈ లేఖలను ముఖ్యమంత్రికి స్వయంగా అందించి సమస్య తీవ్రతను వివరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫీజు చెల్లింపులు నిలిచిపోవడంతో కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.
సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్
బీజేపీ ప్రజాప్రతినిధులు, బీజేవైఎం నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవాలని రామచందర్‌రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి అందిన లేఖలు, వినతిపత్రాలను సీఎంకు అందించి పెండింగ్ బకాయిల విడుదలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
48 గంటల దీక్షతో ఒత్తిడి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ ఇప్పటికే ఆందోళనలను ముమ్మరం చేసింది. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రామచందర్‌రావు ఇటీవల 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థుల సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని బకాయిలను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులు, తదుపరి విద్యా అవకాశాలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని రామచందర్‌రావు కోరారు. విద్యార్థుల నుంచి వచ్చిన 8 లక్షలకుపైగా లేఖలను ముఖ్యమంత్రికి అందించేందుకు ప్రయత్నించడం ద్వారా ఈ అంశాన్ని మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
