Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: భాగ్యనగరం తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా ఆదిలాబాద్‌లో గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుగుతున్నాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్పీ సూచించారు. మండపాల నిర్వాహకులు సామరస్యాన్ని పాటిస్తూ మాలాధారణ దీక్ష చేపట్టాలని కోరారు. మండపాల వద్ద జూదం, మద్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా టపాసులు కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అలంకరణ విషయంలో నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, పోలీసు శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
వదంతులను నమ్మొద్దు..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని కోరారు. గణేష్ ఆగమన శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కొందరు వదంతులు వ్యాప్తి చేసే అవకాశం ఉందని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
శాంతియుత వాతావరణం, భక్తిభావం పెంపొందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద నిఘా కోసం తప్పనిసరిగా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఎస్పీ రితిక్ సాయి, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు బి.హనుమాన్లు, టౌన్ సీఐ సునీల్‌కుమార్, టూటౌన్ సీఐ, పలువురు కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
