Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
- గురుకుల సమస్యలపై ఆరా
- మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం పెద్దపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠ్యపుస్తకాలు, భోజన నాణ్యత, తాగునీటి వసతి, వసతి గదులు, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతులపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. గురుకులాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు నాణ్యమైన భోజనం, తాగునీరు, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
