Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

హామీలను గాలికొదిలిన కాంగ్రెస్‌

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

  • నేటి నుంచి బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసనలు..
  • ఆలేరులో సాగునీరందక ఎండిపోతున్న పంటలు

ఆలేరు, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్‌ విమర్శించారు. మంగళవారం ఆలేరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని భిక్షమయ్య గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

ఏమైపోయాయి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు?

అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్‌.. ఇన్నాళ్లైనా ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని భిక్షమయ్య గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రుణమాఫీని సగమే చేసి చేతులెత్తేశారని ఆరోపించారు. రైతుబంధు అమలుపై స్పష్టత లేకపోవడం, రైతు బీమా అందకపోవడంతో రైతాంగం అయోమయంలో పడిపోయిందన్నారు.
రాష్ట్రంలో యూరియా, డీఏపీ కొరత తీవ్రంగా ఉందని, కనీసం ఎరువులను కూడా అందించలేక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆరు నెలలకోసారి రైతు కూలీలకు రూ.12,500 ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని, పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.

ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి ఆక్రోశం

ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని భిక్షమయ్య గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కక్షసాధింపులతో ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నారుమళ్లు ఎండిపోవడంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న సాగునీటి పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌పై రేవంత్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏళ్ల పాటు నిరంతరం పోరాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని భిక్షమయ్య గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేని ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడి బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ పోరాడుతుందని, రోడ్లు, సాగునీరు, ఎరువుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భిక్షమయ్య గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News