Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
సదాశివనగర్, ఆంధ్రప్రభ: సదాశివనగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది.
ఆదివారం సాయంత్రం రహదారి పక్కన ఉన్న భారీ బండరాళ్లను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బ్లాస్టింగ్ చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
బ్లాస్టింగ్ సమయంలో రాళ్ల ముక్కలు సమీపంలోని ఆరావళి హోటల్ వద్దకు ఎగిరిపడ్డాయి. అక్కడ ఆగి ఉన్న కార్లు, వ్యక్తులపై రాళ్లు పడటంతో ఆందోళన నెలకొంది. ఓ కొత్త కారుపై రాళ్ల ముక్కలు బలంగా పడటంతో వాహనానికి నొక్కులు పడ్డాయని కారు యజమాని తెలిపారు.
సాయంత్రం సమయంలో హోటల్ పరిసరాల్లో ప్రజల రాకపోకలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా బ్లాస్టింగ్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
