Pavan Chandragiri October 24, 2026
హ్యాకర్ల బృందం ప్రభుత్వ పోలీసు వ్యవస్థలోకి చొరబడి కీలక సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
లక్షలాది ఈమెయిళ్లు, వేలాది ఐడీ రికార్డులు, మొబైల్ నంబర్లు సహా సున్నితమైన సమాచారం తమ వద్ద ఉందని 'స్కార్లెట్ గ్రూప్' ప్రకటించింది. ఈ సమాచారాన్ని డార్క్‌నెట్‌లో విక్రయానికి ఉంచినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీంతో సైబర్ భద్రతా బృందాలు దర్యాప్తు చేపట్టాయి. అయితే నిజంగానే పోలీసుల డేటాబేస్ హ్యాక్ అయిందా? ప్రచారంలో ఉన్న సమాచారం అసలైనదేనా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
జైపూర్, ఆంధ్రప్రభ :
రాజస్థాన్ పోలీసులకు చెందిన డేటాబేస్‌ను హ్యాక్ చేశామని, కీలక సమాచారాన్ని డార్క్‌నెట్‌లో విక్రయానికి ఉంచామని 'స్కార్లెట్ గ్రూప్' అనే హ్యాకర్ల బృందం ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఆరోపణలపై రాష్ట్ర సైబర్ భద్రతా బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. అయితే పోలీసుల వ్యవస్థల్లోకి హ్యాకర్లు చొరబడ్డారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. లీకైనట్లు ప్రచారంలో ఉన్న సమాచార అసలు మూలం, దాని ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
లక్షలాది ఈమెయిల్ వివరాలు ఉన్నాయంటూ..
తమ వద్ద రాజస్థాన్ పోలీసులకు చెందిన 5,926 మెయిల్‌బాక్సులు, 86.3 లక్షల ఈమెయిళ్లు, 78.3 లక్షలకు పైగా ప్రత్యేక ఈమెయిల్ చిరునామాలు ఉన్నాయని హ్యాకర్లు పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. వీటితోపాటు 70,301 ఐడీ రికార్డులు, 59,460 మొబైల్ నంబర్లు కూడా తమ వద్ద ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ వివరాలన్నీ హ్యాకర్ల వాదనలేనని, వాటిని స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర సమాచార సాంకేతిక, సమాచార ప్రసార శాఖ (డీఓఐటీ అండ్ సీ)కు చెందిన సమాచారాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ బృందం ఆరోపించింది. ఇందులో 1,065 మెయిల్‌బాక్సులు, 69 లాగిన్ వివరాలు, 21 వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) లాగిన్లు, 64 వీపీఎన్ సర్టిఫికెట్లు ఉన్నాయని పేర్కొంది. వీటిలో సీనియర్ అధికారులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు ప్రచారం చేసింది.
హ్యాకర్లు తమ వద్ద ఉన్నాయని చెబుతున్న సమాచారానికి సంబంధించి ప్రథమ సమాచార నివేదికలు (ఎఫ్‌ఐఆర్‌లు), కాల్ డీటైల్ రికార్డులు (సీడీఆర్‌లు)గా పేర్కొన్న పత్రాలను కూడా బయటపెట్టారు. ఎలక్ట్రానిక్ కేవైసీ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, సీనియర్ పోలీసు అధికారుల అధికారిక ఈమెయిల్ ఖాతాల్లోని రహస్య సమాచారం తమ వద్ద ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ పత్రాలు నిజమైనవేనా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పోలీసు వ్యవస్థల నుంచే సేకరించారా? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
మూడు బృందాలతో విచారణ..
రాజస్థాన్ సైబర్ క్రైమ్ డీఐజీ శంతను కుమార్ మాట్లాడుతూ.. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కీలక సమాచారాన్ని స్కార్లెట్ గ్రూప్ దొంగిలించిందన్న సమాచారం అందడంతో సైబర్ కమాండో బృందం, ఇన్సిడెంట్ రెస్పాన్స్ బృందం రంగంలోకి దిగాయని తెలిపారు. రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ కూడా పరిశీలన ప్రారంభించిందని చెప్పారు.
ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక లోపాన్ని గుర్తించలేదని, అయితే సైబర్ దాడి జరిగిందని నిర్ధారించడం కానీ, అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేయడం కానీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (సెర్ట్-ఇన్) దృష్టికి కూడా తీసుకెళ్లారు. భారత సైబర్ నేర సమన్వయ కేంద్రం (ఐ4సీ) కూడా లీక్ ఆరోపణలకు సంబంధించిన వివరాల సేకరణలో సహకరిస్తోంది.
అధికారులకు పాస్‌వర్డ్‌లు మార్చాలని ఆదేశాలు…
పోలీసు సర్వర్లు లేదా నెట్‌వర్క్‌లలోకి చొరబాటు జరిగిందా? ప్రచారంలో ఉన్న పత్రాలను హ్యాకర్లు ఎలా పొందారు? అన్న కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర సైబర్ బృందం, సమాచార సాంకేతిక శాఖ అధికారులు టెలిగ్రామ్ ద్వారా హ్యాకర్ల బృందాన్ని సంప్రదించి వారి వాదనలను పరిశీలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సమాచారాన్ని తిరిగి పొందేందుకు 200 డాలర్ల వరకు చెల్లింపు అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు, రాజస్థాన్‌లోని పోలీసు అధికారులు తమ ఈమెయిల్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. సైబర్ భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లాల అధికారులకు సూచించారు.
కొన్ని పత్రాలు వ్యక్తిగత ఈమెయిల్ ఖాతా నుంచి లేదా సోషల్ మీడియాలో ఇప్పటికే పంచుకున్న సమాచారం నుంచి సేకరించి ఉండవచ్చని డీఐజీ శంతను కుమార్ పేర్కొన్నారు. అయితే దర్యాప్తు నివేదికలు అందిన తర్వాతే స్పష్టమైన నిర్ధారణకు రాగలమని తెలిపారు. వార్త ప్రచురించే సమయానికి రాజస్థాన్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ కూడా అందుబాటులో లేకుండా ఉందని కథనం పేర్కొంది. అయితే వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడానికి సైబర్ దాడే కారణమని అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
