Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై మాజీ కెప్టెన్ల లేఖ..

Pavan Chandragiri August 23, 2026

  • గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌ సహా 21 మంది మాజీ కెప్టెన్ల విజ్ఞప్తి
  • వైద్య పరీక్షలు, కుటుంబ సభ్యుల భేటీలకు అనుమతించాలని డిమాండ్‌

దుబాయ్‌, ఆంధ్రప్రభ: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెట్‌ కెప్టెన్లు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలని కోరుతూ ఆరు నెలల్లో మాజీ కెప్టెన్లు పంపిన రెండవ విజ్ఞప్తి ఇది కావడం గమనార్హం.

ఈ లేఖపై భారత మాజీ కెప్టెన్లు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌తో పాటు గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, అలన్‌ బోర్డర్‌, డేవిడ్‌ గోవర్‌, క్లైవ్‌ లాయిడ్‌, అర్జున రణతుంగ, స్టీవ్‌ వా, జాన్‌ రైట్‌ తదితర 21 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు సంతకాలు చేశారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని మాజీ కెప్టెన్లు లేఖలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించి, ఆయన వ్యక్తిగత వైద్యులు, సోదరి డాక్టర్‌ ఉజ్మా ఖాన్‌ సభ్యులుగా ఉండే మెడికల్‌ బోర్డు ద్వారా పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు.

మూడు ప్రధాన డిమాండ్లు

మాజీ కెప్టెన్లు పాక్‌ ప్రభుత్వానికి మూడు కీలక విజ్ఞప్తులు చేశారు.

  • సుప్రీంకోర్టు ఆదేశించిన మెడికల్‌ బోర్డు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యాన్ని పూర్తిగా, స్వతంత్రంగా పరిశీలించే అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా ఆయన కుడి కంటికి సంబంధించిన చూపు సమస్యపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
  • కోర్టు పునరుద్ధరించిన వారపు కుటుంబ సభ్యుల భేటీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
  • వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైన చికిత్సను ఆలస్యం లేకుండా అందించాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా స్పందన

ఈ లేఖపై సంతకం చేసిన మాజీ కెప్టెన్లు.. తాము రాజకీయ ఉద్దేశాలతో ఈ విజ్ఞప్తి చేయడం లేదని స్పష్టం చేశారు. క్రికెట్‌ మైదానంలో ఏర్పడిన అనుబంధంతోనే ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, పాకిస్థాన్‌ అంతర్గత రాజకీయ, న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని తెలిపారు.

గత ఫిబ్రవరిలో కూడా 14 మంది మాజీ కెప్టెన్లు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్‌ ప్రధానమంత్రికి లేఖ రాశారు. జైలులో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక కంటిచూపు దాదాపు కోల్పోయినట్లు ఆయన కుటుంబం చేసిన ఆరోపణల నేపథ్యంలో వారు స్పందించారు.

జాబితాలో ప్రముఖులు

లేఖపై సంతకం చేసిన వారిలో భారత మాజీ కెప్టెన్లు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, అలన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్‌ గోవర్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌, శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ, న్యూజిలాండ్‌కు చెందిన జాన్‌ రైట్‌ తదితరులు ఉన్నారు.

2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్‌ ఖాన్‌.. పదవి నుంచి తొలగించిన అనంతరం పలు కేసుల్లో శిక్షలు ఎదుర్కొంటున్నారు. అవినీతి కేసుల్లో ఆయనకు 10, 14, 17 ఏళ్ల జైలు శిక్షలు విధించబడ్డాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పరిస్థితులు, విచారణ తీరుపై పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు గతంలో ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News