Bala Raju August 29, 2026andhra pradesh, ap, AP news, prabhanews.com
స్వర్ణకవచాలతో కనకదుర్గమ్మ దర్శనం..
తిరువీధుల్లో ఆదిదంపతుల విహారం
పుష్పాలంకరణలో ఆలయ ప్రాంగణం..
వైభవంగా గిరిప్రదక్షిణ
అమ్మవారిని దర్శించుకున్న మారిషస్ మంత్రి
వెండి గిన్నెలు సమర్పించిన భక్తుడు
ఒక్కరోజే 51,923 మంది భక్తుల దర్శనం..
10,111 మందికి అన్నప్రసాదం
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : శ్రావణమాస పౌర్ణమి, శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మవారి శ్రావణమాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల వర్ణరంజిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వైభవంగా గిరిప్రదక్షిణ..
ఉదయం నిర్వహించిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా సాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించగా.. ఆదిదంపతుల దర్శనంతో భక్తులు పులకించిపోయారు.
వీఐపీ దర్శనాలు.. వెండి కానుక..
శుక్రవారం మారిషస్ మంత్రి కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో భక్తుడు అమ్మవారికి విలువైన వెండి గిన్నెలను కానుకగా సమర్పించారు.
51,923 మంది భక్తుల దర్శనం..
శ్రావణ పౌర్ణమి, శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థానం గణాంకాల ప్రకారం శుక్రవారం 51,923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 7,065 దర్శన టికెట్లు జారీ కాగా, 60,014 యూనిట్ల ప్రసాదం పంపిణీ చేశారు. 442 సేవల్లో భక్తులు పాల్గొన్నారు. 1,359 మంది తలనీలాలు సమర్పించారు. 10,111 మంది అన్నప్రసాదం స్వీకరించారు. హుండీ కానుకలుగా రూ.5,200 ఆదాయం నమోదైంది.
