Bharath August 28, 2026prabhanews.com
- భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాది మంది భక్తులు..
- జయజయధ్వానాలతో మార్మోగిన గిరి ప్రదక్షిణ మార్గం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం విశేష పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలో పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఘాట్‌రోడ్డు ప్రవేశ మార్గం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
దేవస్థానం ధర్మప్రచారంలో భాగంగా సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రదక్షిణ మార్గం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి వాహనం ముందు స్థానిక మహిళలు ఆయా ప్రాంతాల్లో రహదారులను పసుపునీటితో శుద్ధి చేసి హారతులు ఇచ్చారు. కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారి నామస్మరణతో జయజయధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు దేవస్థానం తరఫున శ్రీ అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఘాట్‌రోడ్డు శ్రీ అమ్మవారి ఆలయం నుంచి కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, భజనలు, వేదమంత్రోచ్చారణలతో ప్రదక్షిణ మార్గం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, మన్నే కళావతి తదితరులు పాల్గొన్నారు.
