Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
లబ్ధిదారులను పరామర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
మంగళవారం రాప్తాడు మండలంలోని 16 పంచాయతీల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాప్తాడు గ్రామంలో టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.
పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల చొప్పున, వివిధ అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి రూ.6 వేల చొప్పున పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం అందుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం రాప్తాడు, గంగలకుంట, రామినేపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా 50 శాతం రాయితీతో మంజూరైన పశువుల దాణాను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పండమేరు వెంకటరమణస్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో అక్కడ వంతెన నిర్మాణం కూడా చేపడతామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో అచ్యుతానంద బాబు, రాప్తాడు మార్కెట్ యార్డు అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, కన్వీనర్ కొండప్ప, పీఏసీఎస్ చైర్మన్లు గోపాల్ నాయుడు, బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నాయకుడు ఉప్పర శ్రీనివాసులు, ఎంపీటీసీ జాఫర్ ఖాన్, హిందూ పూజారి అధ్యక్షుడు వెంకట రాముడు, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, క్లస్టర్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
