Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Italy-Naples-Mafia : గోడల్లో.. నేలమాళిగల్లో Andhra Prabha Crime Story

Babu Bahadur September 24, 202629 Crore Cash Seized, Caivano Mafia Raid, Italy Cash Seizure, Italy Mafia Raid, Naples Carabinieri, Naples Mafia

Italy-Naples-Mafia : గోడల్లో.. నేలమాళిగల్లో Andhra Prabha Crime Story

  • రూ.29 కోట్ల కట్టలు!
  • ఇటలీలో మాఫియా గుట్టురట్టు
  • నేపుల్స్‌లో భారీ నగదు పట్టివేత
  • 34 మంది అరెస్టు..
  • 11 రోలెక్స్‌ వాచీలు, ఆయుధాలు స్వాధీనం

కొన్నేళ్ల కిందట ఓ సినిమాలో.. నకిలీ ఐటీ బృందం ఓ మినిప్టర్ ఇంటిపై దాడి చేస్తుంది. ఇంటి గోడల్లో.. బాత్ రూమ్ ల్లో.. మెయిన్ హాలు ఫ్లోర్ కింద వందల కోట్ల నోట్లకట్టలు,.. బంగారం, వజ్ర వైఢూర్య నగలు దొరుకుతాయి. నిజంగా అవినీతి పరులు ఇలా డబ్బును దాచేస్తారా? అని ప్రేక్షకులు ముక్కున వేలు వేసుకుని.. .. ఏమో గుర్రం ఎగరవచ్చు అని సర్దుకున్నారు. అంతే కాదు.. జైలు గది నుంచి డీల్స్ చేసే నేరగాళ్ల కథలూ.. సినిమాల్లో చూశాం. మరి ఈ కథల డైరక్షన్ లోనే.. నిజ జీవితంలో ఓ మాఫియా కూడా మేం సైతం దోచుకున్న డబ్బును.. గోడల్లో ,.. నేలమాళిగల్లో దాచింది. ఈ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఐతే…ఇక్కడ ఓ చిన్న ట్విస్టు ఉంది. ఈ ఘటన భారత దేశంలో జరగలేదు. నగరం తగలబడిపోతుంటే ఫిడేలు వాయించాడే.. అదే నీరో చక్రవర్తి రాజధాని రోమ్ నగరంలో జరిగింది. సంచలనం రేపిన ఈ ఘటన తీరు తెన్ను తెలిస్తే.. కళ్లప్పగించి ఆశ్చర్య పోవాల్సిందే గురూ.. ఎందుకంటే పోలీసులు తవ్విన గోడల్లో.. నేల మాళిగల్లో రూ..20 కోట్లు దొరికాయి మరి,.

(రోమ్‌, ఆంధ్రప్రభ)

మాఫియా ముఠా అక్రమ సంపాదనలో భారీ నగదు నిల్వలు ఇటలీలో వెలుగు చూశాయి. ఇళ్ల గోడల్లో.. నేల కింద.. ఫర్నిచర్‌ మాటున దాచిన కోట్లాది రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేపుల్స్‌లోని కైవానో ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏకంగా 32 లక్షల యూరోలు (సుమారు 36 లక్షల డాలర్లు) వ7క్కిరించాయి.. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.29 కోట్లకు పైమాటే. ఈ ఆపరేషన్‌లో 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నేపుల్స్‌ కారబినియరీ మిలిటరీ పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 యూరోల నోట్ల కట్టలను సెల్లోఫేన్‌ కవర్లలో చుట్టి పక్కాగా దాచిపెట్టారు. గోడలు, నేల పలకల కింద వరుసగా పేర్చడంతో పాటు వార్డ్‌రోబ్‌లలోని రహస్య అరల్లోనూ నగదును భద్రపరిచారు. వాటిని బయటకు తీసిన అధికారులు ప్లాస్టిక్‌ మాప్‌ బకెట్లలో నింపి, సాయుధ వాహనంలోకి తరలించారు. నగదుతో పాటు 11 విలాసవంతమైన రోలెక్స్‌ చేతి గడియారాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల విక్రయానికి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

జైళ్ల నుంచే డీల్స్‌.. !

నెలల తరబడి సాగిన నిఘా, దర్యాప్తు అనంతరం ఈ దాడులు చేపట్టారు. నేపుల్స్‌ మాఫియా వ్యతిరేక ప్రాసిక్యూటర్‌ నికోలా గ్రాటెరీ నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ జరిగింది. జైళ్లలో ఉన్న ముఠా సభ్యులు అక్రమంగా సెల్‌ఫోన్లు తెప్పించుకుని, వాటి ద్వారా బయట ఉన్న అనుచరులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖైదీల బంధువుల ద్వారా ఈ ఫోన్లు జైళ్లలోకి చేరినట్లు గ్రాటెరీ వెల్లడించారు.

నేరాల సమాచారం అందించిన కొందరు వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగింది. సాక్షులకు రక్షణ కల్పిస్తామన్న హామీతో సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో దొరికినోళ్లందరూ పేరుమోసిన ఏంజెలినో మాఫియా ముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. కైవానో ప్రాంతంలో ఈ ముఠా ఎంతగా చొచ్చుకుపోయిందంటే.. గత ఏడాది అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం న్యాయపరమైన పర్యవేక్షణలోకి తీసుకోవాల్సి వచ్చిందని గ్రాటెరీ పేర్కొన్నారు.

'కైవానో మోడల్‌'పై దుమారం

నేరాల నియంత్రణ, పట్టణ పునరుద్ధరణ లక్ష్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం 2023లో 'కైవానో మోడల్‌'ను ప్రవేశపెట్టింది. యువత నేరాల బారిన పడకుండా చూడటంతో పాటు, మాదకద్రవ్యాల విక్రయాలు, వీధి నేరాలకు ప్రత్యామ్నాయంగా సానుకూల అవకాశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం.

అయితే, తాజా మాఫియా దాడులు, అరెస్టుల నేపథ్యంలో ఈ కార్యక్రమం విఫలమైందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. గ్రీన్స్‌ అండ్‌ లెఫ్ట్‌ అలయన్స్‌కు చెందిన ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుడు ఫ్రాన్సిస్కో బొరెల్లి స్పందిస్తూ.. మాఫియాను పూర్తిగా ప్రక్షాళన చేశామంటూ ప్రధాని, మంత్రులు ప్రచారం చేసుకున్నారని, కానీ దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బిజినెస్ డీల్స్ బురఖాలో..

అరెస్టయిన 34 మందిపై మాఫియా తరహా నేరపూరిత సంఘంలో భాగస్వామ్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, విక్రయాల కోసం మాదకద్రవ్యాలను కలిగి ఉండటం వంటి అభియోగాలున్నాయి. నేర ముఠా కార్యకలాపాల నిర్వహణ తీరును కూడా అధికారులు గుర్తించారు.ఈ ముఠా ఓ వ్యాపార సంస్థ తరహాలో పనిచేసినట్లు గ్రాటెరీ వివరించారు. అక్రమ కార్యకలాపాల కోసం సభ్యులను వేర్వేరు సమయాల్లో విధుల్లో నియమిస్తూ, మాదకద్రవ్యాల విక్రయాలు, బెదిరింపులతో వసూళ్లు వంటి నేరాలను వ్యవస్థీకృతంగా నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

స్వాధీన నగదు,, న్యాయ నిధికి

స్వాధీనం చేసుకున్న నగదును ఇటలీ 'జస్టిస్‌ ఫండ్‌'కు జమ చేయనున్నారు. వ్యవస్థీకృత నేరాల బాధితులకు సహాయం అందించేందుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఇదే సమయంలో, ఇటీవలి నెలల్లో తమ విభాగానికి ప్రభుత్వం నిధుల కోతలు విధించడంపై గ్రాటెరీ వ్యంగ్యంగా స్పందించారు. నేరస్థుల ఫోన్లపై నిఘా పెట్టేందుకు వినియోగించే ఫోన్‌ ట్యాపింగ్‌ ఖర్చులను తగ్గించాలని మంత్రి భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ''ఈ ఒక్క ఆపరేషన్‌లో పట్టుబడిన 32 లక్షల యూరోలు నేరుగా జస్టిస్‌ ఫండ్‌కు వెళ్తాయి. నేపుల్స్‌లో ఏడాది పాటు ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్వహించేందుకు అయ్యే ఖర్చు దీనితో సమకూరినట్లే. ఇలాంటి మరిన్ని ఆపరేషన్లు చేపట్టాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.
మాఫియా ముఠా గుట్టును రట్టు చేసిన ఈ భారీ ఆపరేషన్‌ ఇటలీలో వ్యవస్థీకృత నేరాలపై మరోసారి చర్చకు తెరలేపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News