Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాకు చెందిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తబస్సుమ్ 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర మహిళా జట్టుకు ఎంపికైనట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రావణ్ రెడ్డి, బోనగిరి శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 20 నుంచి 22 వరకు హైదరాబాద్ బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జట్టు సన్నద్ధత శిబిరం నిర్వహించారు. సన్నద్ధత శిబిరంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు.
ఎంపికైన తెలంగాణ జట్టు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో జరగనున్న 72వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొననుంది. మహిళల విభాగంలో నిజామాబాద్‌కు చెందిన తబస్సుమ్ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం పట్ల జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
తబస్సుమ్‌ను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రావణ్ రెడ్డి, చైర్మన్ అల్జాపూర్ దేవేందర్ రెడ్డి, ప్యాట్రన్ మానస గణేష్, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, కాశిరెడ్డి సునీత, రాజేష్, నిర్వహణ కార్యదర్శి నాగేష్, నరేందర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎల్. నర్సింగ్ రావు, కార్యదర్శి కృష్ణమూర్తి, సంఘం కార్యవర్గ సభ్యులు సురేష్, మాధురి, భాగ్యశ్రీ, ఆనంద్, కార్తీక్, సీనియర్ క్రీడాకారులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో తబస్సుమ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రంతో పాటు నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
