Pavan Chandragiri August 24, 2026
- కీలక నేతలతో భేటీకి రంగం సిద్ధం..
- పరకాల టికెట్, వరంగల్ జిల్లా బాధ్యతలపై చర్చ..
- వరంగల్ కాంగ్రెస్‌లో పెరిగిన విభేదాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కొండా ఫ్యామిలీ వివాదం మరో మలుపు తీసుకుంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత జనసేన పార్టీలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం సుష్మిత జనసేన కీలక నాయకులను కలవనున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్‌లోని ఒక కీలక నాయకుడి నివాసంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో సుస్మిత రాజకీయ భవిష్యత్, జనసేనలో చేరిక, పార్టీలో ఆమెకు దక్కే ప్రాధాన్యం, బాధ్యతలపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ బాధ్యతలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. గత కొంతకాలంగా కొండా సురేఖ కుటుంబం పరకాల నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో సుస్మిత రాజకీయ అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త వివాదానికి దారితీశాయి. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచి పోటీ చేస్తారని సీఎం ప్రకటించారు. దీంతో కొండా సురేఖ వర్గంలో అసంతృప్తికి కారణమైంది.
కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, తమ కుమార్తె సుష్మితను పరకాల నుండి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రకటనపై వారి అనుచరుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పార్టీ హైకమాండ్ నిర్ణయం లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి ఎలా ప్రకటించగలరని కొండా వర్గం ప్రశ్నించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
పరకాల ఎమ్మెల్యేగా రాబోతున్నా.. : సుస్మిత
ఈ పరిణామాల మధ్య కొండా సుస్మిత తన రాజకీయ ఆకాంక్షలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. తల్లి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పరకాల నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. తనకు అవకాశం రాకపోయినా పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదనే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి నేతలు కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
దీంతో కొండా సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నుంచి మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ అయ్యాయి. కొంతమంది కాంగ్రెస్ నేతల నుంచి… పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు నేతలు కూడా పరకాల టికెట్‌పై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంగల వెంకట్రామ్‌రెడ్డి కూడా గతంలో పరకాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2018, 2023 ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని, ఈసారి తనకు అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కలిసి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెంచాయి.
జనసేనలో చేరితే కొత్త సమీకరణాలు?
ప్రస్తుతం కొండా సుస్మిత జనసేన వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం… నిజమైతే తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో తమ బలాన్ని పెంచుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో… కొండా కుటుంబం వంటి రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుల రాక పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే జనసేనలో చేరికపై ఇప్పటివరకు కొండా సుస్మిత నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. జనసేన నేతలతో జరగనున్నట్లు చెబుతున్న భేటీ తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరకాల రాజకీయాల్లో ఇప్పటికే మొదలైన పోరు.. ఇప్పుడు సుస్మిత రాజకీయ నిర్ణయంతో మరింత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేక జనసేన కండువా కప్పుకుంటారా? అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
