Babu Bahadur September 24, 2026China US Summit 2026, Peaceful Coexistence, US China Relations, Xi Jinping, Xi Jinping Trump Meeting, Xi Jinping US Visit
Jinping-Us-China-Telations : కలిసి సాగుదాం Andhra Prabha Top News
- సహజీవనమే శరణ్యం!
- అమెరికాతో నవబంధంపై జిన్‌పింగ్ వ్యాఖ్యలు
- అమెరికాలో పర్యటన వేళ చైనా విదేశాంగ శాఖ ప్రకటన
(వాషింగ్టన్/బీజింగ్, ఆంధ్రప్రభ)
అమెరికా, చైనా పరస్పరం కలిసి మనుగడ సాగించగలవని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ తమ సంబంధాలను సజావుగా కొనసాగించేందుకు సరైన మార్గాన్ని అన్వేషించగలవని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌కు చేరుకున్న సందర్భంగా జిన్‌పింగ్ చేసిన లిఖితపూర్వక వ్యాఖ్యలను బీజింగ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
''కొత్త శకంలో చైనా, అమెరికా వంటి రెండు ప్రధాన దేశాలు పరస్పరం ఎలా కలిసి మెలిసి ఉండాలన్న దానికి సరైన మార్గాన్ని మనం కనుగొనగలం.. కనుగొనాలి కూడా. అలా చేయగలమన్న నమ్మకం నాకుంది'' అని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోటీ నేపథ్యంలో జిన్‌పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా-చైనా సంబంధాల్లో పోటీ ఉన్నప్పటికీ, సహజీవనం సాధ్యమేనన్న సందేశాన్ని ఆయన మరోసారి వినిపించారు. ఈ ఏడాది మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడూ జిన్‌పింగ్ ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
'చైనా పునరుజ్జీవనం'.. జిన్‌పింగ్ నినాదం
చైనా దేశం తిరిగి వైభవాన్ని సంతరించుకోవాలన్న 'చైనా జాతి మహా పునరుజ్జీవనం' నినాదం జిన్‌పింగ్ రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 'అమెరికా ఫస్ట్' విధానాలకు 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' (మాగా) నినాదాన్ని వినియోగిస్తున్నట్లుగానే.. జిన్‌పింగ్ సైతం చైనా పునరుజ్జీవనాన్ని తన పాలనా దార్శనికతలో ప్రధానాంశంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యధిక అధికారాలను కేంద్రీకరించుకున్న నేతగా జిన్‌పింగ్ ఎదిగారు. అమెరికా అధ్యక్షుడికి ఎదురయ్యే మధ్యంతర ఎన్నికలు, ఓటర్ల తీర్పు వంటి రాజకీయ సవాళ్లు ఆయనకు లేవు. అయితే, దేశీయంగా మాత్రం పలు ఆర్థిక సమస్యలు ఆయన ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి.
ఆర్థిక సవాళ్లు.. ఏఐపై భారీ ఆశలు
చైనా దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్న సంక్షోభం, యువతలో అధిక నిరుద్యోగం వంటి సమస్యలు జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు చైనా విస్తృతంగా కృషి చేస్తోంది. అయితే, ఈ రంగంలో సాగుతున్న భారీ ప్రయత్నాలు ఇంకా ఆశించిన స్థాయిలో ఉత్పాదక సామర్థ్యంగా రూపాంతరం చెందలేదన్న విశ్లేషణలున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్లాలన్నది జిన్‌పింగ్‌కు కీలకంగా మారింది. వాణిజ్య వివాదాలు, సాంకేతిక పోటీ, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇరుదేశాలూ సహజీవనానికి మార్గం కనుగొనగలవన్న ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ఈ సానుకూల సందేశం ఆచరణలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది తాజా శిఖరాగ్ర చర్చలతో తేలనుంది.
