Bala Raju September 20, 2026prabhanews.com, Telangana, TG News
రైతుల సబ్సిడీ పరికరాలు, దరఖాస్తు పత్రాలు దగ్ధం
జెసీబీతో రేకులు తొలగించి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
Jogipet | జోగిపేట, సెప్టెంబర్ 20(ఆంధ్రప్రభ ) : జోగిపేట మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా గోదాం నుంచి మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉంచిన రైతులకు సంబంధించిన వ్యవసాయ సబ్సిడీ పరికరాలతో పాటు కార్యాలయానికి చెందిన పాత ఫర్నిచర్, రైతుల దరఖాస్తు పత్రాలు తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమై బూడిదైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదాంకు తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్లి మంటలను అదుపు చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో జెసీబీ సహాయంతో గోదాం పైకప్పు రేకులను తొలగించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో మరింత నష్టం తప్పినట్లు స్థానికులు తెలిపారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గోదాంలో ఎంతమేర ఆస్తి, సబ్సిడీ పరికరాలు దగ్ధమయ్యాయన్నది అధికారులు అంచనా వేయాల్సి ఉంది.
