Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కాంగ్రెస్‌ అంటేనే దగా, మోసం: పువ్వాడ అజయ్‌ కుమార్‌

Rama Rao September 2, 2026Telangana, TRS

వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపణ
కేసీఆర్‌ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయమని వ్యాఖ్య

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలు మోసపోవడం ఖాయమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే హెచ్చరించారని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు చేపట్టి, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీని సైతం సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో అందడం లేదని, గురుకుల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. కేసీఆర్‌ తిరిగి రావడం పక్కా, రామరాజ్యం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. జర్నలిస్టుల కోసం గతంలో మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా వైరా రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, మాజీ సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి, వీరు నాయక్‌, చిట్టెంశెట్టి పరమేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, తోట రామారావు, ఎండీ కమర్‌, షేక్‌ మక్బూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News