Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కాంగ్రెస్ వైఫల్యంతోనే రైతాంగం కన్నీరు!

Bala Raju September 23, 2026prabhanews.com, Telangana, TG News

నీళ్లు ఉండి కూడా ఇవ్వలేని దుస్థితి.. రైతాంగం కన్నీరు పెడుతోంది
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్లు నింపాలి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్‌ఎస్ శాసనసభ ఉపపక్ష నేత తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు.

బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు చేశారు.తెలంగాణలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు లేవని ప్రశ్నించారు.

కల్వకుర్తి ఎత్తిపోతలపై విమర్శలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటార్లకు గాను ఒకటి, రెండు మోటార్లు మాత్రమే నడుపుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రోజుకు కేవలం ఎనిమిది గంటల పాటు మోటార్లు నడపడం వల్ల రైతులకు అవసరమైన స్థాయిలో నీరు అందడం లేదన్నారు. రోజుకు 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 800 క్యూసెక్కుల మేరకే నీరు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆరోపణలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లను పూర్తి చేసి అప్పగించిందని హరీశ్‌రావు తెలిపారు. మొత్తం 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు చెప్పారు.

2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 145 మెగావాట్ల భారీ మోటార్‌ను ప్రారంభించడంతో నార్లాపూర్ రిజర్వాయర్‌కు నీరు చేరిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్యాకేజీ-3లో మిగిలిన కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే నాలుగు రిజర్వాయర్లను నీటితో నింపవచ్చని అన్నారు. మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ప్రభుత్వం మూడేళ్లుగా కొనసాగిస్తోందని విమర్శించారు.

సీఎంపై విమర్శలు

పాలమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తినని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. శ్రీశైలం జలాలను వినియోగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వాటా నీటిని వినియోగించుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. నీటిని ఎందుకు వినియోగించుకోవడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మండిపాటు

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు ఎక్కువగా, పనులు తక్కువగా ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో నీటి వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కును పూర్తిగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు సాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్వి ఆర్ ఎస్ ప్రవీణ్‌, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News