Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం

Sowjanya Anneboina August 30, 2026prabhanews.com

చిన్నారులకు ఆటస్థలం.. వాకర్స్‌కు మెరుగైన సౌకర్యాలు

హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న జీడబ్ల్యూఎంసీ పార్కు, కమ్యూనిటీ సెంటర్‌ను వరంగల్ ఎంపీ డా.

కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. పార్కులోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్, పచ్చదనం, మొక్కల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పార్కుకు వచ్చిన వాకర్స్, స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు, వారి అవసరాలను తెలుసుకున్నారు. కనకదుర్గ కాలనీ పార్కును ఆధునిక సౌకర్యాలతో మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు.

వర్షాకాలంలో వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా పార్కులో ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల వయసుకు అనుగుణంగా వివిధ ఆట పరికరాలను ఏర్పాటు చేసి సురక్షితమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. కుటుంబాలతో కలిసి పార్కుకు వచ్చేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా పార్కు గోడలపై కాకతీయ కళా వైభవం, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆకర్షణీయమైన చిత్రాలు వేయించాలని సూచించారు.

పార్కు అందాన్ని పెంచడంతో పాటు నగర చరిత్రను ప్రజలకు పరిచయం చేసేలా తీర్చిదిద్దాలని ఎంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు, యువతకు ఉపయోగపడేలా ధ్యానం కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్ పరికరాలను మెరుగుపరచాలని తెలిపారు. సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా దీపాల వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, పార్కు భద్రత కోసం సౌర విద్యుత్ కంచె ఏర్పాటుపైనా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

పార్కు అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని, అవసరమైతే తమవంతు సహకారం అందిస్తామని ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కనకదుర్గ కాలనీ ప్రజలకు మరింత మెరుగైన పచ్చదనం, ఆరోగ్యం, వినోద సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పార్కును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత, కార్పొరేషన్ అదనపు కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక వాకర్ అసోసియేషన్ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానికులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News